Telangana Congress: తెలంగాణ ఎన్నికల ఏడాదిలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఇప్పటికే దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీకీ తామే ప్రత్యామ్నాయమంటూ ప్రకటనలకే పరమితమైంది. ప్రకటనలతో పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదు. దీంతో పార్టీ కొత్త ఇన్‌చార్జి రాష్ట్రంలో కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. కదనరంగంలోకి దూకేందుకు పార్టీని సిద్ధం చేస్తున్నారు.

50 స్థానాలపై గురి..
తెలంగాణలో ఎప్పుడైనా ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండపై జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వీటితోపాటు కేడర్ ఎక్కువగా ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని సెగ్మెంట్లను ఫోకస్ పెట్టింది. 50 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నల్ సర్వే ద్వారా గుర్తించింది. దీంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాలపై ఇంకాస్త దృష్టి పెడితే మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కావొచ్చని భావిస్తోంది.
పాదయాత్ర రూట్‌మ్యాప్ రెడీ..
టీపీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి ఈనెల 26 నుంచి చేపట్టబోయే పాదయాత్ర రూట్ మ్యాప్‌ను పార్టీ సిద్ధం చేస్తోంది. ఇందులో మూడు ఉమ్మడి జిల్లాలతోపాటు పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గాలు ఉండేలా రూపొందించినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తొలుత మూడు రిజర్వుడు లోక్‌సభ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. మిగిలిన రిజర్వుడు నియోజకవర్గాలకు కూడా త్వరలోనే కోఆర్డినేటర్లను నియమించనున్నారు.
చేరికలపై దృష్టి..
ఇదే సమయంలో చేరికలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ విధానాలతో విసిగిపోయిన లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ముఖ్యమైన నేతలకు గాలం వేసే పనిలో ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతోంది. పొంగులేటిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్ల కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

కోమటిరెడ్డి రాకతో జోష్..
ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నన్ని రోజులు గాంధీ భవన్ గడప తొక్కనని సవాల్ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం గాంధీ భవన్‌కు వచ్చారు. పార్టీ ఇన్‌చార్జి పిలుపు మేరకు వచ్చానని తెలిపారు. తాను రానని ఎప్పుడూ అనలేదని ప్రకటించారు. ఇంతటితో ఆగకుండా రేవంత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవు అన్నట్లుగా అత్యంత సన్నిహితంగా కూర్చున్నారు. ఇద్దరూ చాలాసేపు ముచ్చటించారు. తెలంగాణలో, కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంతోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తమ టార్గెట్ అని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవైపు సీనియర్లు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని బజారుకు ఈడుస్తుంటే వెంకట్‌రెడ్డి గాంధీ భవన్‌కు రావడం, పార్టీని అధికారంలోకి తెస్తామని ప్రకటించడం ఆ పార్టీకి పెద్ద ఊరట అని చెప్పవచ్చు.