ఒక సాధారణ కేసులో పోలీసుల అత్యుత్సాహం సీబీఐ విచారణ వరకూ తీసుకువెళ్లింది. ఈ కేసు ప్రభావం ఇంతలా ఉంటుందని పోలీసులు ఊహించలేదు. డాక్టర్ సుధాకర్ కేసు పోలీసు వర్గాల్లో కలకలం బయలుదేరింది. ఎన్-95 మాస్క్ లు ఇవ్వడంలేదంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి సస్పెండైన డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు ఈనెల 16న పోర్టు ఆస్పత్రి సమీపంలో చేతులు వెనక్కి విరిచి కట్టి, అర్ధనగ్నంగా ఉంచి, లాఠీలతో కొట్టి అరెస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో బాధితుడి వాంగ్మూలానికి, ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వ్యత్యాసం ఉండటంతో సుధాకర్ అరెస్టు విషయాన్ని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. దీంతో పోలీసుల్లో కలవరపాటు మొదలయ్యింది. ఈ కేసు విషయంలో హైకోర్టు చాలా సీరియస్ గా వ్యవహరిస్తుండటంతో ఎవరికి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ సుధాకర్ ను లాఠీ తో కొట్టిన కానిస్టేబుల్ ఒకరిని విశాఖ కమిషనర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ అంశంపై విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారం నగర పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
సీబీఐ అధికారులు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేస్తే ఎవరెవరిని నిందితులుగా చేర్చుతారనే దానిపై చర్చ మొదలైంది. డాక్టర్ సుధాకర్ పోలీసులు కావాలనే తనను రెచ్చగొట్టారని, పోలీసులు తనను బలంగా పట్టుకొని అనంతరం తన వాహనంలో ఉన్న డబ్బులు తీసుకుని, మందు బాటిల్స్ పెట్టారని వాగ్మూలంలో తెలిపాడు. చేతులు వెనక్కి మెలితిప్పి కట్టేసి రెండు గంటలు రోడ్డుపై ఉంచారని చెప్పారు. దీంతో సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ అయిన వీడియోలను పరిశీలిస్తున్నారు. వీటిల్లో తమ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దృష్టి పెట్టారు. అదేవిధంగా హైకోర్టుకు పిటిషనర్ ఎలాంటి వీడియోలు సమర్పించారో కూడా ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా సీబీఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించడం ప్రారంభించారు. కొంతమంది సిబ్బందిని పిటిషనర్ అనిత ఇంటికి పంపించి, వాటికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు.
ఈ వ్యవహారంలో చర్యలు ఎవరిపైన ఉంటాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంఘటనా స్థలంలో వున్న సిబ్బందిపైనా, లేదా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓపైనా లేదంటే సీన్‌కు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది, అధికారులు అంద్దరిపైనా అనేది హైకోర్టు తేల్చాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఎవరూ లేకుండా అక్కడకు వెళ్లడమే తాము చేసిన తప్పని సిబ్బంది ఇప్పుడు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శాఖాపరమైన విచారణ అయితే సులువుగా బయట పడేందుకు వీలుంటుందని, సీబీఐ కేసులో ఇరుక్కుంటే దానిని క్లియర్ చేసుకునేందుకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.