BRS leaders : చెరువులో నీళ్లున్నప్పుడు ఎక్కడెక్కడ నుంచో కప్పలు వస్తూ ఉంటాయి. అదే చెరువులో నీళ్లు అయిపోయినప్పుడు కప్పలు తమ దారి తాము చూసుకుంటాయి. ఇదే సూత్రం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ నుంచో నేతలు మొత్తం పార్టీలో చేరేందుకు వస్తూ ఉంటారు. ఆ అధికారం కోల్పోయిన తర్వాత తమ దారి తాము చూసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దాకా అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ్ కి నేతగా ప్రచారం చేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఢీకొట్టగలిగే శక్తి తనకు మాత్రమే ఉందని సొంత మీడియాలో రాయించుకున్నారు. అంతేకాదు ప్రభుత్వ ఖజానా లో ఉన్న డబ్బుతో తెలంగాణ మోడల్ అనే విధంగా దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇప్పించుకున్నారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నామనే సంకేతాలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఢిల్లీలో ఏకంగా కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తోట చంద్రశేఖర్ ను భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడిగా నియమించారు. ఆమధ్య వైజాగ్ స్టీల్ బిడ్ లో పాల్గొంటామని మీడియాకు లీకులు ఇచ్చారు. సింగరేణి అధికారులను విశాఖపట్నం పంపించి అక్కడి ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించేలా చేశారు.. ఇక కర్ణాటకలో జేడీఎస్ కు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి గాల్వాన్ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చి దానిని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు. మహారాష్ట్రలో అయితే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము చెల్లించుకుంటూ తన పార్టీ కోసం కేబినెట్ ర్యాంకుతో ఒక సెక్రటరీని కూడా నియమించుకున్నారు.
ఇదంతా జరుగుతుండగానే ఒడిశా మీద కూడా కెసిఆర్ కన్నేశారు. అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిధర్ గోమాంగ్ దొంగ ఓటు వేసి ఆయన ప్రభుత్వాన్ని కూల్చారు. తర్వాత కాలంలో గిరిధర్ గొమాంగ్ ఒడిశాకు ముఖ్యమంత్రి అయ్యారు. కొంత కాలానికి ఆయన ఓడిపోయారు. నవీన్ పట్నాయక్ దాటికి మళ్ళీ అధికారంలోకి రాలేకపోయారు. ఎలాగో గిరిధర్ గొమాంగ్ ఖాళీగా ఉండటంతో ఆయనను అప్పట్లో భారత రాష్ట్ర సమితిలోకి కేసిఆర్ చేర్చుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా గులాబీ కండువా కప్పారు. గిరిధర్ కు ఒడిశా రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో కెసిఆర్ భారీగానే అతడికి నగదు సహాయం చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంతో గిరిధర్ గొమాంగ్ కెసిఆర్ కారు నుంచి దిగిపోయారు. ఒడిశా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కెసిఆర్ కు షాక్ తగిలినట్టు అయింది.
సరిగ్గా రెండు నెలల క్రితం ప్రతిపక్షాల మీద తీవ్ర విమర్శలు చేసి, కేంద్రంలో ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి, చివరికి ప్రధానమంత్రి కూడా లెక్కచేయకుండా కెసిఆర్ వ్యవహరించారు. కానీ కొంతకాలానికే ఆయన తెలంగాణలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. దేశ్ కి నేత అని ప్రచారం చేసుకున్న ఆయన కామారెడ్డిలో బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అందుకే రాజకీయాలనేవి ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవని.. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయని చెబుతుంటారు. కాకపోతే అధికారంలో ఉన్నవారు కాస్త సమయమనం పాటిస్తే ప్రజలకు కూడా పాలకులపై గౌరవం ఉంటుంది. లేకుంటే తీవ్రమైన వ్యతిరేకత పేరుకుపోయి అది ఓటు రూపంలో అధికారాన్ని దూరం చేస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఎదుర్కొంటున్నది కూడా అటువంటిదే.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Brs leaders joining congress from brs party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com