Kotha Prabhakar Reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో బీఆర్‌ఎస్ నాయకులు త్వరలోనే ప్రభుత్వం పడిపోతుంది అంటూ ప్రచారం చేశారు. కేటీఆర్ అయితే.. త్వరలో కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఆపరేషన్ ఆకర్స్‌కు తెరతీశారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్(Congress)లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ సైలెంట్ అయితే. 16 నెలల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చానలి కోరుతున్నట్లు దుబ్బాక ఎమ్మెల్యే(Dubbaka MLA) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read: ఆమె విషయంలో తోక ముడిచిన వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా
దుబ్బాక ఎమ్మెలే‍్య కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy) వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డబ్బులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం జరుగుతోందని తెలిపారు. ఈ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండగా, ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారానికి తెరలేపాయి. ఎమ్మెల్యేలను డబ్బులతో కొనుగోలు చేసే ప్రసక్తి ఇప్పటివరకు బహిరంగంగా చర్చకు రాలేదు. అయితే, వ్యాపారవేత్తలు భారీగా నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన చెప్పడం కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు ఈ ఆరోపణల వెనుక కేసీఆర్ హస్తం ఉందని నిప్పులు చెరిగారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్ ధ్వజం
బీఆర్ఎస్ పార్టీ గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్రను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు బీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను జాతరగా జరుపుకున్న బీఆర్ఎస్(BRS), ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు లాంటి నేతలు గతంలో ఫిరాయింపులను సమర్థించినప్పుడు ఒకలా, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేస్తున్నారు.
బీఆర్ఎస్ బలం..
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అధికారంలోకి రావాలంటే మరో 33 మంది ఎమ్మెల్యేలు అదనంగా కావాలి. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా ఈ సంఖ్య సరిపోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం రాజకీయ కలకలం రేపేందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడగా చూస్తూ, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.
రాజకీయంగా దూరం..
కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఎంతవరకు లబ్ధి చేకూరుస్తాయన్నది చర్చనీయం. ఒకవైపు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ఆలోచన ఉందని చెప్పడం, మరోవైపు దాని వెనుక కేసీఆర్ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్విగ్నతను పెంచింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుంది, రాజకీయ శక్తుల సమీకరణలను ఎలా ప్రభావితం చేస్తుందన్నది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతానికి, ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి.