
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. ముఖ్యంగా కేంద్ర మంత్రులను కలిసి విభజన హామీలు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ ప్రర్యటన ప్లాన్ చేసుకున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం రెండు గంటకు సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సి.ఎం.ఓ అధికారులు సీఎం పర్యటన రద్దైనట్లు వెల్లడించారు.
సీఎం పర్యటన రద్దుకు కారణాలను అధికారులు వెల్లడించలేదు. దీంతో సీఎం పర్యటన రద్దుకు కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరకక పోవడంతో నే సీఎం పర్యటన రద్దు చేసుకుని ఉంటారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు అనుకోకుండా కేంద్ర హోం మంత్రి షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకోవడంతో సీఎం పర్యటన వాయిదా వేసుకున్నారని వినికిడి. చివరి నిముషంలో సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడటం రాజధానిలో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం ఢిల్లీ వెళితే హోం మంత్రి అమిత్ షాను కలిసి విభజన అంశాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి కరోనా లాక్ డౌన్ ఫలితంగా దెబ్బతిన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించి ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కోరాలని నిర్ణయించారు. జలవనరుల శాఖ మంత్రి షెకావత్ ను కలిసి పోలవరం, కృష్ణ, గోదావరి నదీ జలాలు వినియోగం, తాజాగా తెలంగాణా వైఖరితో వచ్చిన సమస్యలు తదితర అంశాలు చర్చించాలని భావించారు. ఈ పర్యటన రద్దైన కారణంగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి సమస్యలను కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.