ఏపీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి నవరత్నాల హామీల అమలే ప్రధానంగా చెబుతూ వైసీపీ ప్రజలకు చేరువై రికార్డు స్థాయిలో సీట్లు సాధించింది. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ సర్కార్ వల్ల తమ బ్రతుకుల్లో మార్పు వస్తుందని ఏపీ ప్రజానీకం భావించారు. అయితే 15 నెలల వైసీపీ పాలనపై జనం మాత్రం సంతృప్తిగా లేరనే చెప్పాలి.
సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ సర్కార్ పై పెద్దగా విమర్శలు లేకపోయినా అభివృద్ధి విషయంలో జగన్ సర్కార్ పూర్తిస్థాయిలో ఫెయిల్ అవుతోందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ వివాదాస్పద భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆలస్యమవుతోందని… జగన్ సర్కార్ ఇప్పటికే ఈ స్కీమ్ అమలు కోసం పలు తేదీలను ప్రకటించి వెనక్కు తగ్గిందని ప్రజలు చెబుతున్నారు.
ఇక రాష్ట్రంలో రోడ్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. గతుకులు, గుంతలతో కూడిన రోడ్ల వల్ల గ్రామాల ప్రజలే కాదు పట్టణాల ప్రజలు సైతం తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రతిరోజూ 10,000 కరోనా కేసులు నమోదవుతూ ఉండటంపై కూడా ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 3,000 లోపే కరోనా కేసులు నమోదవుతూ ఉండగా ఏపీలో ఎక్కువ కేసులు నమోదు కావడానికి కారణాలేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వైరస్ ఉధృతి అంతకంతకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. హైకోర్టు, సుప్రీం కోర్టులలో జగన్ సర్కార్ వరుస మొట్టికాయలు తింటున్న నేపథ్యంలో తొందరపాటు చర్యల వల్లే వైసీపీకి ఈ పరిస్థితి ఎదురవుతోందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కొన్ని విషయాల్లో తీరు మార్చుకోకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఏ విధమైన ఫలితాలు పొందిందో 2024 ఎన్నికల్లో వైసీపీ అవే ఫలితాలు పొందుతుందని అభిప్రాయపడుతున్నారు.