Geetha Jayanti Express : దసరా పండుగ వేళ ఈ ఘటన జరగడంతో రైల్వే శాఖ ఉలిక్కిపడింది. ప్రత్యేక రైళ్లు నడుస్తున్న ఆ మార్గంలో.. రాకపోకలను నిలిపి వేయాల్సి వచ్చింది.. దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్న నేపథ్యంలోనే.. ఈ ప్రమాదం చోటు చేసుకోవడం రైల్వే శాఖను కలవరపాటుకు గురిచేసింది. గత ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 18 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు మొత్తం రైల్వేలో భారీ ప్రమాదాలు చోటు చేసుకునేందుకు దుండగులు చేసిన కుట్రలుగా రైల్వే శాఖ వెల్లడించింది. అయితే ఈ ప్రమాదాలను అత్యంత తెలివిగా నిర్వీర్యం చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే మనదేశంలో అన్ని వర్గాల ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తక్కువ ధరలు ఉండడంతో సుదూర ప్రాంతాలకు రైళ్ల ద్వారా ప్రయాణిస్తారు. అత్యంత చవకైన రైలు ప్రయాణం ఇప్పుడు ప్రయాణికులను కలవరపాటుకు గురిచేస్తోంది. అక్టోబర్ 12న తమిళనాడు రాష్ట్రంలోని భాగమతి ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా దర్భంగా ప్రయాణించాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్(12578) రైలు తమిళనాడులోని కవరై పెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 కోచ్ లు చెల్లా చెదురయ్యాయి. పట్టాలు తప్పడంతో రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ నిర్వహిస్తోంది.
మధ్యప్రదేశ్లో మరో దారుణం..
భాగమతి ఎక్స్ ప్రెస్ దారుణాన్ని మర్చిపోకముందే.. మధ్యప్రదేశ్లోని చతర్ పూర్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. అక్టోబర్ 13 ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్ ప్రెస్ రైలు కోచ్ లో ఉదయం మంటలు చిలరిగాయి. కురుక్షేత్ర – ఖజురహో ప్రాంతాల మధ్య ఈ ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తుంది. ఆదివారం ఈ రైలులో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని చతర్ పూర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈశానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు అంతకంతకు విస్తరించడానికి గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు స్పందించి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. మంటలు వెంటనే అదుపులోకి వచ్చాయి.. మండల వల్ల రైలు దాదాపు గంట ఆలస్యంగా నడుస్తోంది. కోచ్ దిగువన ఉన్న రబ్బరు వేడి ఎక్కడం వల్ల.. నిప్పు రవ్వలు చెలరేగాయి.. అవి మంటలుగా మారాయని తెలుస్తోంది. రైలు క్రమేపి వేగం పుంజుకోవడం వల్ల ఆ మంటలు విస్తరించాయని ప్రయాణికులు చెబుతున్నారు. ” మంటలు వ్యాపించిన సమాచారాన్ని ప్రయాణికులు మాకు అందించారు. వెంటనే మేము స్పందించాం. మంటలు అంతకంతకూ విస్తరించకుండా ఆర్పి వేశాం. నష్టం జరగకుండా చూశాం. ప్రమాదానికి కారణం రబ్బరు వేడెక్కడం వల్లే అని మాకు అర్థమైంది. ఇటువంటి ఘటన మరోసారి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని” స్టేషన్ మాస్టర్ ఆశిష్ యాదవ్ ప్రకటించారు.