రైతుల గురించి మాట్లాడని పార్టీ లేదు, మాట్లాడని సంఘం, అంగం లేదు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ప్రతిఒక్కరూ , ప్రతి సందర్భంలో రైతుల పై ప్రేమ ఒలకబోసేవాళ్ళే. అయినా వాళ్ళ బతుకుల్లో మార్పు రాలేదు. అన్ని పార్టీల ప్రభుత్వాలు ఏదోఒక సందర్భంలో అధికారాన్ని వెలగబెట్టినవే. కాని రైతులకు బంగారు జీవితం ఎవరూ తీసుకురాలేకపోయారు. కారణమేమిటి? అంటే వీళ్ళ ఆలోచనల్లో ఎక్కడో లోపముంది. ఇందులో కొంతమంది నిజాయితీగానే జీవితమంతా రైతుల తరఫున మాట్లాడారు, పోట్లాడారు. అయినా ఫలితం రాలేదు. అంటే నిజాయితీ తో పాటు మన విధానమూ సరయినదై వుండాలి. గ్రీన్ విప్లవం, నీలి విప్లవం, తెల్ల విప్లవాలు వచ్చాయి. ఎంతోకొంత వెసులుబాటు వచ్చింది. అయినా ఎక్కడో వెలితి. మిగతా ప్రపంచం మనకన్నా ముందు పరిగెడుతుంది, ఈ దౌడులో వెనకబడితే మనం శాశ్వతం గా వెనకబడతాం. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది. వ్యవసాయ రంగానికి కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే రోజులు మారాయి, మనమూ మారాలి. అదేంటో చూద్దాం.
వ్యవసాయరంగం లో సంస్థాగత మార్పులు
స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ వ్యవసాయరంగం లో ప్రధాన నినాదం భూసంస్కరణలు. ఈ రోజు ఆ నినాదం అంతగా ఆకర్షించబడటం లేదు. కారణం దేశంలో ఎక్కువభాగం చిన్న, సన్నకారు రైతులే వున్నారు. ఆ మేరకు ఈ నినాదం బాగానే పనిచేసింది. ఇప్పుడు సమస్యలు మారినాయి. మనమూ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఈ రోజుకీ ఎక్కువమంది వ్యవసాయ , గ్రామీణ రంగం పైనే ఆధారపడుతున్నారు. అంతమందికి సరిపడా పని, ఉత్పత్తి ఉందా అంటే లేదనే చెప్పాలి. దానికి ప్రత్యామ్నాయం ఉపాధి హామీ పధకం కాదు. ఇది కేవలం వుపశమనమే. తాత్కాలిక పరిష్కారమే. శాశ్వత పరిష్కారం కావాలి. ఒకటి, ఉపాధికోసం పట్టణాలకు కొంతమంది తరలటం, అదే వలస కార్మికుల వ్యవస్థ. దానిపై ఇంకోసారి మాట్లాడుకుందాం. మరి మిగిలిన వాళ్లకు పూర్తి పనికల్పించాలన్నా , అధిక ఉత్పత్తి జరగలన్నా ఇప్పుడున్న వ్యవస్థలో మార్పులు రావాలి. చిన్న కమతాలు ఒకనాడు ముద్దు. ఇప్పుడు భారం. దీనికి ప్రత్యామ్నాయమే కలిసికట్టుగా రైతు ఉత్పత్తి సంఘాలు. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఎంత తొందరగా అందిపుచ్చుకుంటే అంతగా లబ్ది చేకూరుతుంది. చిన్న, సన్నకారు రైతులు విడి విడిగా చేయలేనిపని సహకారంతో సాధించవచ్చు. అధునాతన సాంకేతికత, అధిక పెట్టుబడులు, దేశీ,విదేశీ మార్కెట్ చొరవ లాంటి అనేక ప్రయోజనాలు ఇందులో పొందవచ్చు. ఇదో సంస్థాగత మార్పు. దీన్ని ఆహ్వానిద్దాం.
ఇకపోతే ఇటీవలి సంస్కరణలపై ఎంతో చర్చ జరుగుతుంది. అందులో కొన్ని నిజాలు, కొన్ని కల్పనలు కలిపి వండి వారుస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలు రైతులు, వ్యవసాయ నిపుణులు ఎన్నో ఏళ్ళ నుంచి కోరుతున్నవనేనని మరిచిపోవద్దు. వ్యవసాయ ఉత్పత్తుల కొరత నుంచి మిగులు దేశంగా తయారయ్యాం. అందుకు పాలకులను, నిపుణులను అభినందిద్దాం. కాకపోతే అంతటితోటి సంతృప్తి చెందామంటే వెనకబడి పోవటం ఖాయం. ఆహార ధాన్యాలు , ఇతర ఉత్పత్తులు స్వేచ్చగా నిలవచేసుకోవటానికి, అమ్ముకోవటానికి, రవాణా చేసుకోవటానికి, అలాగే అవసరమయితే ముందుగా సంస్థలతో ఒప్పందం చేసుకోవటానికి కావాల్సిన సంస్థాగత మార్పుల్ని ఈ చట్టాలు సమకూర్చిపెట్టాయి. ఖచ్చితంగా ఇది ముందడుగే. అదేసమయం లో పాత వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి అది కావాలనుకునే వాళ్ళు దాన్ని కూడా నిరభ్యంతరం గా ఉపయోగించుకోవచ్చు. అంటే పోటీ మార్కెట్ తయారవుతుందన్నమాట. పోటీ మార్కెట్ లో రైతుకి ప్రయోజనం కలుగుతుంది. బజారులో నువ్వు కొనుక్కోవటానికి పలు రకాల బ్రాండ్లు దొరుకుతున్నట్లే రైతుకు కూడా దేశంలో ప్రభుత్వ మార్కెట్, ప్రైవేట్ మార్కెట్ కూడా అందుబాటులో వుంటుంది. ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకునే స్వేచ్చ వుంది. ఈ ఆర్డినెన్సు వచ్చిన తర్వాత కొన్ని ఉత్పత్తులపై రైతులకు అదనపు లాభం చేకూరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో ప్రభుత్వం ప్రత్యక్షంగా కొనేది కేవలం 6 శాతమేనని మరిచిపోవద్దు. మిగతాది ఇప్పటికే మార్కెట్ నియంత్రణ లోనే వుంది. ఒక్క పంజాబ్, హర్యానా లో తప్పించి ప్రభుత్వ మార్కెట్ పకడ్బందీ గా అమలు కావటం లేదు. అక్కడా మార్కెట్ పన్నుల పేరుతో రైతుల దగ్గర వసూలుచేస్తూనే వున్నారు. కమీషన్ ఏజెంట్లు , మార్కెట్ అధికారులు, వ్యాపారస్తులు కలిసి కూడబలుక్కొని రైతుల్ని మోసం చేయటం జరుగుతూనే వుంది. కాబట్టి అదేదో అంత పవిత్రమైనదని కూడా చెప్పలేము. దానిలో లాభసాటిగా వుంటే రైతులు అక్కడికే వెళతారు కదా. భయం దేనికి?
సమస్య ఎక్కడుంది?
సమస్య రాజకీయంలో వుంది. దురదృష్టవశాత్తు మనదేశం లో రైతు సంఘాలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా వున్నాయి. ఒకే సంఘం లేదు. స్వాతంత్రానికి ముందు అఖిల భారత కిసాన్ సభ వుండేది. అందులో అందరూ వుండేవారు. అలాగే కార్మికులకు AITUC పేరుతో ఒకే సంఘం వుండేది. కానీ తర్వాత ప్రజా సంఘాలు చీలికలు, పీలికలు అయ్యాయి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్లకు అనుబంధంగా ఒక ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేసాయి. ఇదే అనర్ధాలకు మూల కారణం. వ్యవస్థీకృత సంఘం దేశ వ్యాప్తంగా లేదు. తెలంగాణా లో కెసిఆర్ మంచి ఆలోచనే చేసాడు. గ్రామ స్థాయి నుంచి వ్యవస్థీకృత రైతు సమితులను ఏర్పాటు చేసాడు. కాన్సెప్ట్ మంచిదయినా ఆచరణలో దాన్ని పార్టీ కార్యకర్తల పునరావాస కేంద్రంగా మార్చాడు. అలా కాకుండా నిజమైన రైతు ప్రతినిధి సంస్థగా ప్రజాస్వామ్య పద్దతిలో నిర్మించివుంటే మంచి సంఘం అయి వుండేది. అన్నిరంగాల్లో ఇదే సమస్య. కార్మిక రంగంలోనూ, వృత్తిరంగాల్లోనూ ఇదే సమస్య భారత్ ని వెంటాడుతుంది.
మరి రైతులు ఏమి చేయాలి? ఈ రకమైన రాజకీయ సంఘాలకు స్వస్తి పలకాలి. గ్రామానికి ఒకే సంఘం వుండాలి. దానికి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు క్రమం తప్పకుండా జరగాలి. రైతులు తమ సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తారనుకుంటే వారిని ఎన్నుకుంటారు. ఈ దొంతర మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కలిసి జాతీయ సంస్థని ఎన్నుకోవాలి. దీనితో క్రమం తప్పకుండా ప్రభుత్వం సంప్రదింపులు జరిపి జాతీయ విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలి. ఇందులో రాజకీయాలకు తావుండకూడదు. కార్మికులకు సలహా సంఘాలు అధికారికంగా వున్నప్పుడు రైతులకీ అదే పద్దతిలో వ్యవస్థీకృత వ్యవస్థ ఉన్నప్పుడే రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.
మరి ప్రస్తుత ఆందోళన సంగతేమిటి? ఇది కేవలం రాజకీయ కోణంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నమేనని నా అభిప్రాయం. పంజాబ్, హర్యానాలో రైతుల్లో వున్న అపోహలు తొలగించాల్సి వుంది. మిగతా ప్రాంతాల్లో రైతులని రాజకీయ పార్టీలే రెచ్చగోడుతున్నాయి. నిజంగా రైతుల్లో భయాందోళనలు వుంటే వీళ్ళ రాజకీయాలకు అదనపు విలువ చేకూరుతుంది. లేకపోతే కొద్దిరోజుల్లో తుస్సు మంటుంది. వచ్చే రబీ సీజన్ లో ప్రభుత్వం కనీస మద్దత్తు ధరకు ఇప్పటిలాగే కొన్నప్పుడు రైతుల్లో వున్న అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. అప్పటివరకూ రాజకీయ క్రీడ నడుస్తూనే వుంటుంది. మంచిదే కదా. అసలే ప్రతిపక్షం బలహీనంగా వుంది. పాపం కొంత పుంజు కోనీ. ప్రజాస్వామ్యంలో రెండు పక్షాలు బలంగా వుండాలి కదా.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Independent farmers organizations need of hour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com