దేశ రాజధాని ఒకవైపు చలి, రెండోవైపు కరోనా మహామ్మరితో సతమతమవుతూ తల్లడిల్లుతుంటే మూడో వైపు రైతుల ఆందోళనలతో చక్ర దిగ్బంధంలో కూరుకుపోయింది. పంజాబ్ నుంచి అధికసంఖ్యలో పాల్గొన్న రైతులు, హర్యానా,రాజస్తాన్,పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా గణనీయమైన సంఖ్యలో వచ్చారు,వస్తున్నారు. ఇంతకుముందే 26వ తేదీ కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేసారు. అంటే కిసాన్-కార్మిక వర్గాలు మోడీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లు అనుకోవాలి. ప్రస్తుతం మనం జరుగుతున్న రైతు ఆందోళన గురించి మాట్లాడుకుందాం. ఇది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన. దీని పూర్వాపరాలు ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాం. తిరిగి స్థూలంగా పరిశీలిద్దాం.
వ్యవసాయ సంస్కరణలు రైతుల్లో నిజంగానే గుబులు పుట్టిస్తున్నాయా?
మోడీ గత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులపై పెద్ద దుమారమే లేచింది. ఎందుకంటే ఈ చట్టాలు వ్యవసాయరంగంలో మౌలిక మార్పులకు స్వీకారం చుట్టాయి. స్వాతంత్రానంతరం వ్యవసాయరంగంలో ఇవే అత్యంత మౌలిక మార్పుగా చెప్పొచ్చు. 1991 ఆర్ధిక సరళీకృత విధానాల తర్వాత ఇదే అతి పెద్ద మౌలిక సంస్కరణ. ఇంతవరకూ జరిగిన సంస్కరణలన్నీ తయారి,సేవా రంగాలకు సంబంధించినవి. వ్యవసాయరంగంలో ఇంతపెద్ద సాహసం ఏ ప్రభుత్వం చేయటానికి సాహసించలేదు. ఈ సంస్కరణలు విధానపరమైనవి. రైతు పండించే పంట ఎవరు కొనాలి,ఎక్కడ అమ్మాలి,ఎన్నాళ్ళు నిల్వ చేసుకోవాలి అనే మౌలిక అంశాలకు సంబంధించినవి. ఇప్పటివరకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగుతుంది. మొట్టమొదటసారి ప్రయివేటు రంగానికి కూడా ఇందులో చోటు కల్పించారు. ఇదే అతిపెద్ద వివాదం. దీన్ని ప్రతిపక్షాలు కార్పొరేటు శక్తులకు ప్రభుత్వం రాచబాట వేస్తుందని విమర్శిస్తున్నాయి. కానీ ప్రభుత్వం దీనితో వ్యవసాయరంగంలో పోటీ వాతావరణం ఏర్పడుతుందని ,దీనివలన రైతులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అందుకనే ఇది రెండు విధానాల మధ్య జరుగుతున్న ఘర్షణగా చెప్పొచ్చు. స్థూలంగా చెప్పాలంటే ఆర్ధిక సంస్కరణలు కోరుకునేవారు ఒకవైపు,ప్రభుత్వ గుత్తాధిపత్యం కొనసాగాలనే వారు వేరొకవైపు మొహరించినట్లయ్యింది.
ఈ బిల్లుల్లో సారాంశమేమిటంటే రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ప్రభుత్వ నియంత్రణ ఆహారధాన్యాలపై వుండదు. ఇదీ దీని సారాంశం. అదేసమయంలో ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే మండీ వ్యవస్థ ఎప్పటిలాగే కొనసాగుతుంది. అందులో అమ్మే ఉత్పత్తులకు కనీస మద్దత్తు ధర ఎప్పటిలాగే కొనసాగుతుంది. ఈ బిల్లులు ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వం కనీస మద్దత్తు ధరను పెంచింది, పంజాబ్ లో అదివరకటి కన్నా ఎక్కువ ధాన్యాన్ని కొంది. అంటే రైతుకి ఈ రెండు వ్యవస్థలు అందుబాటులో వుంటాయి. అదివరకటిలాగా ఖచ్చితంగా మండీలోనే అమ్మాలనే నిబంధన ఏమీ వుండదు. అది రైతు ఇష్టం. వాస్తవానికి ఇప్పుడు రైతు పంటలన్నీ ప్రభుత్వం కొనుగోలు చేయటంలేదు. మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 10 శాతం కూడా ప్రభుత్వం కొనటంలేదు. మిగతా 90 శాతం ప్రైవేటు మార్కెట్ లోనే అమ్ముతున్నారు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుందాం. రైతులు మార్కెట్ కమిటీల ద్వారా పంటను అమ్ముకునేదానికన్నా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేదే చాలా ఎక్కువ. కాని దానికి చట్టబద్దత లేదు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా దానికి చట్ట బద్దత వచ్చింది. రైతుకి ప్రైవేటుగా అమ్మినదానికి రక్షణ వచ్చింది. ఇది ఏ విధంగా రైతుకు నష్టమో అర్ధంకావటంలేదు. పేరుకి చాలా పంటలకు మద్దత్తు ధర వున్నా వాస్తవానికి గోధుమ,వరి మాత్రమే ఎక్కువ మోతాదులో కొంటున్నారు. మిగతావి నామమాత్రమే. ఇంకో అంశం పంటల ఉత్పత్తిలో ఆహారధాన్యాల శాతం తగ్గి, ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు, పాడి,మత్స్య పరిశ్రమలకు ప్రాధాన్యం పెరిగింది. వీటికి ప్రభుత్వ మద్దత్తు ధరతో సంబంధం లేదు. ప్రస్తుతం వీరు ఎటువంటి చట్టబద్దతలేని ప్రైవేటు రంగంలో బతుకుతున్నారు. వారికి ఈ బిల్లులు ఎంతో ఉపయోగపడతాయి. విమర్శకులు, ప్రతిపక్షాలు చెప్పే వాదనలు ఒక్కొక్కటీ పరిశీలిద్దాం.
ప్రతిపక్షాలవాదనలో పసవుందా?
ఈ బిల్లులు సన్నకారు రైతులకు నష్టం కలిగిస్తుంది, ఇదీ విమర్శ. ఇందులో వాస్తవమెంత? ఒకటి, సన్నకారు రైతైనా, ఎవరైనా పంటను బలవంతంగా అమ్మమని చట్టం ఎక్కడా నిర్దేశించటం లేదు. మార్కెట్ లో ధర గిట్టుబాటు అయినప్పుడే రైతు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతాడు. లేకపోతే మండీలోనే అమ్ముకుంటాడు. ప్రస్తుతం రైతు తన పంటను తన ఖర్చులతోనే మండీకి తరలించుకోవాలి. అక్కడ కొనేదాకా నిరీక్షించాలి. దీనిపై కధనాలు రోజువారి పత్రికల్లో చూస్తూనే వున్నాం. అదే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు తన దగ్గరకు వచ్చి పంట కొనే అవకాశముంది. ధర గిట్టుబాటు అయినప్పుడు రైతుకి ఇది అదనపు సౌకర్యం. ఇప్పుడుకూడా అనధికారికంగా ఎక్కువమంది రైతులు చేసేపనే ఇది. ఇప్పుడు దీనికి చట్టబద్దత వచ్చింది. దీనితో కార్పొరేటు సంస్థలు, బహుళజాతి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం వుంది. దురదృష్టవశాత్తు దీన్ని ఓ మంచి అవకాశంగా చూడకుండా అదేదో భూతంలాగా చూపించటం,భావోద్రేకాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఉదాహరణకు పాల వ్యాపారం నూటికి తొంభై శాతం ప్రైవేటు రంగంలోనే వుంది. అందులో అముల్ లాంటి పెద్ద సంస్థల దగ్గరనుంచి, బహుళజాతి సంస్థలు కూడా వున్నాయి. పాలు అమ్మే రైతులు చిన్న,సన్నకారు ఎక్కువగా వున్నారు. వాళ్ళకేమీ నష్టం జరగటంలేదు. మార్కెట్ సూత్రమే అది. మార్కెట్ లో గుత్తాధిపత్యం రానంతవరకూ వుత్పత్తిదారుడికి పోటీ వుంటే లాభమే జరుగుతుంది. పోటీ మార్కెట్ లేనప్పుడు, గుత్తాధిపత్యం వున్నప్పుడు ప్రభుత్వరంగమైనా వుత్పత్తిదారునికి/రైతుకి/వినియోగదారునికి నష్టమే జరుగుతుంది. ఇది ప్రాధమిక సూత్రం. దీనికి ఉదాహరణలు మనకు కోకొల్లలు. ప్రపంచంలో ఎక్కడాలేని ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని కొనసాగించటం వలన రైతు నష్టపోయి, మధ్య దళారులు,అవినీతికర ప్రభుత్వ అధికారులు బాగుపడుతున్నారు. ఓ విధంగా ఈ పోటీని సృష్టించటం వలన రైతుకి లాభమే జరుగుతుంది.
రెండో వాదన, ఒకవేళ బిల్లులు రద్దుచేయటం కుదరకపోతే ప్రైవేటు వ్యక్తులకు/సంస్థలకు కూడా కనీస మద్దత్తు ధర సూత్రం వర్తింప చేయాలి. ఇది ఆచరణసాధ్యం కాదు. ఇందాకనే మాట్లాడుకున్నట్లు రైతుకి ప్రైవేటు మార్కెట్ ధర గిట్టుబాటు కానప్పుడు బలవంతంగా అమ్మాల్సిన అవసరంలేదు. మండీకే పంట తీసుకెల్లొచ్చు. ఈ బిల్లులవలన మండీ వ్యవస్థలో అమ్మకాలకు ఆటంకం ఉండదని ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. రైతుకి మండీ వ్యవస్థ అందుబాటులో వున్నప్పుడు ఈ వాదనకు అర్ధంలేదు. కాకపోతే ఇక్కడ ఒక తిరకాసువుంది. ఇందాకనే ప్రస్తావించినట్లు 90 శాతం క్రయ,విక్రయాలు ప్రైవేటు రంగంలోనే జరుగుతున్నాయి. మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వం కొనే సామర్ధ్యం లేదు. లేనప్పుడు రైతు తన పంటను ఎలాగోలాగా వదిలించుకోవాలనే తాపత్రయంతో వచ్చినకాడికి అమ్మేస్తున్నాడు. ఇది ఈ బిల్లువలన కొత్తగా వచ్చింది కాదు. ఇప్పటికే జరుగుతున్నది. ఇప్పుడు ఈ బిల్లులవలన ప్రైవేటు పెట్టుబడులు రావటంతో పోటీ పెరిగి అధిక రేటు వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే ఈ సంస్థలు విదేశీ ఎగుమతులు కూడా జరుపుతాయికాబట్టి. కాకపోతే కార్పొరేటు సంస్థలు, బహుళజాతి సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ప్రాధమిక వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తే అవి రావు. ప్రభుత్వం దగ్గర అన్ని వనరులు లేవు. ఇదీ పరిస్థితి. పెట్టుబడులు కావాలా, భావోద్రేకాలతో వ్యవసాయరంగం ఇలానే కునారిల్లాలా? ఈ సంస్కరణలతో వ్యవసాయరంగంలో పెట్టుబడులు వచ్చి వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోవాలంటే ఇదొక్కటే మార్గం.
మూడోది, ప్రైవేటురంగం ప్రవేశంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు దెబ్బతింటాయనేది. ఇదో వూహాజనితం. ఆధారంలేని అపోహలు. ఎందుకంటే వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వకుండా ప్రపంచంలో ఏ ప్రభుత్వం నడవదు, అమెరికాతో సహా. ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే రైతు క్షేమం దృష్టిలో పెట్టుకొనే ఏ ప్రభుత్వమైనా పనిచేయాలి. మోడీ ఆలోచన వేరుగావుంది. ప్రభుత్వం దగ్గర వున్న వనరులు పరిమితం కాబట్టి ప్రైవేటు రంగాన్ని కూడా ప్రవేశపెట్టి అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటురంగం కలిసి అధిక పెట్టుబడులతో వ్యవసాయరంగాన్ని ఆధునికరించాలనే తాపత్రయమే ఇందులో కనబడుతుంది. దీన్ని ఎయిర్ ఇండియాతోనో, ఇంకో వాణిజ్య వ్యాపారంతోనో పోల్చలేరు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఇటువంటి నిరాధార ఆరోపణలని ముందుకు తోసి ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయి. ఇప్పుడున్న ఫెర్టిలైజర్ సబ్సిడీ, మిగతా ఇన్పుట్ సబ్సిడీలు, కనీస మద్దత్తు ధరను ఏ ప్రభుత్వమూ తీసివేయలేదు. కాకపోతే 100 శాతం వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు కాబట్టే ఈ సంస్కరణలు.
మరి పంజాబ్ రైతులే ఎక్కువగా ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
కారణం లేకపోలేదు. అక్కడపండే గోధుమ,వరి 90 శాతందాకా మండీల ద్వారానే రైతులు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో లేదు. మధ్య దళారులు ఎంతోమంది దీనిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే వాళ్ళు రైతుల కష్టాన్ని తన లాభంగా మార్చుకున్నారు. వీళ్ళందరూ రాజకీయ పలుకుబడి కల వాళ్ళు. పంజాబ్ లో సగటు రైతు భూవిస్తీర్ణం దేశానికంటే అధికంగా వుంది. దేశంలో రైతు సగటు భూవిస్తీర్ణం 1 హెక్టారు వుంటే ఇక్కడ 3హెక్టార్లు వుంది. కాబట్టి చిన్న,సన్నకారు రైతు నిర్వచనం పంజాబ్ లో వేరేగా వుంది. అయినా ఇంతమంది రైతులు రోడ్లమీదకు వచ్చారంటే వాళ్ళలో ఖచ్చితంగా భయాందోళన వుంది. దీన్ని తొలగించాల్సిన బాధ్యత ఎంతయినా వుంది. వాస్తవానికి రైతులకు పోటీ మార్కెట్ వుండటం వలన వచ్చిన నష్టమేమీ లేదు. నష్టపోయేది దళారులే. ప్రభుత్వ వాదనలో మెరిట్ వుంది. కానీ ఒక్కోసారి మెరిట్ ఒక్కటే సరిపోదు. అది నిజమని అవతలివాళ్ళు నమ్మాలి. ఇప్పుడు పంజాబ్ రైతుల్లో అది లోపించింది. ప్రభుత్వ చర్యలపై అపోహలు వున్నాయి. అటువంటప్పుడు నివారణామార్గాలు వెదకాలి.
ఇక పంజాబ్ రైతుల ఆందోళనలు పెడదారి పడుతున్నాయని సాంఘిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల్లో వార్తలు వస్తున్నాయి. ఇందిరాగాంధీకి పట్టిన గతే మోడీకి పడుతుందని, ఖలిస్తాన్ సాధిస్తామని, మాకు ఇమ్రాన్ ఖాన్ మిత్రుడని, మోడీ శత్రువని, బింద్రెన్ వాలా అమరవీరుడని మాట్లాడటం చూసాం. అయితే వీటిని అతిగా చూపించి వాటికి ప్రాధాన్య మివ్వకపోవటమే మంచిది. ఇప్పటికే కెనడా,అమెరికా,బ్రిటన్ లో ఇటువంటి పెడ ధోరణులు ప్రచారం చేసే సిక్కు సంస్థలు చాలానే వున్నాయి. వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా కెనడాలోని వారు. దీన్ని ప్రభుత్వం, మీడియా చాలా జాగ్రత్తగా పరిష్కరించాలి. పంజాబ్ పాకిస్తాన్ బోర్డర్ రాష్ట్రం, ఒకసారి ఖలిస్తాన్ ఉద్యమంలో తీవ్రంగా ప్రతిస్పందించిన రాష్ట్రం. కాబట్టి ఇటువంటి పెడ ధోరణులు పెరగకుండా అదేసమయంలో అతిగా స్పందించి సమస్యను తీవ్రతరం చేసుకోకుండా చేసుకుంటేనే మంచిది. పంజాబీలు భారత రక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఎవరో కొంతమంది చేసే వ్యాఖ్యానాలకు అతిగా స్పందించటం మంచిదికాదు.
కిం కర్తవ్యం?
వాస్తవానికి దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గి పండ్లు, కూరగాయలు,వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. పాడి, మత్స్య పరిశ్రమల ఉత్పత్తి పెరిగింది. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగంలో వీళ్ళే ప్రముఖపాత్ర పోషించ బోతున్నారు. వీళ్ళందరూ ఈ సంస్కరణలపై ఆశాభావం గానే వున్నారు. ముఖ్యంగా ఆహార ధాన్యాలు అదీ గోధుమ,వరి పండించే రైతుల్లోనే ఈ ఆందోళన ఎక్కువగా వుంది. దీనికి పరిష్కారం ఒక్కటే కనబడుతుంది. ఈ పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి స్వేచ్చ ఇస్తే మంచిది. నిజంగా ప్రభుత్వ వాదన ప్రకారం రైతుకి లాభం వుంటే ఒకటి,రెండు సంవత్సరాల్లో అదే రాష్ట్రాలు ఈ సంస్కరణలను అమలుచేస్తాయి. అంతవరకూ వాళ్లకు స్వేచ్చ ఇచ్చి మిగతా రాష్ట్రాల్లో ఈ సంస్కరణలు అమలుచేయటం ఒక్కటే పరిష్కారంగా కనబడుతుంది. రైతుల్లో అపోహలు తొలగేవరకు ఇదే సరైన పరిష్కారంగా కనబడుతుంది. అంటే ఆ రాష్ట్రాల్లో యధాతధ స్థితి కొనసాగించటం. దీనికి ప్రభుత్వం, రైతులు ఒప్పుకుంటారని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Merits and demerits in farmers agitation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com