Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరికొందరు ఆర్థిక వనరులు లేక వీటిని తొలగించేందుకు రకరకాల టిప్స్ వీడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్ స్కిన్ తో పాటు మొటిమల సమస్యల పరిష్కారానికి తక్కువ ఖర్చుతో చికిత్స అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జనౌషధి కేంద్రాల్లో సెలైసిలిక్ యాసిడ్ (Salicylic Acid) ఫేస్‌వాష్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే?
యుక్తవయస్సు, పీరియడ్స్, గర్భధారణ లేదా ఇతర హార్మోన్ల మార్పుల సమయంలో మహిళల్లో మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో సరైన చర్మ సంరక్షణలో భాగంగా వైద్యుల సూచన మేరకు సెలైసిలిక్ యాసిడ్ ఫేస్‌వాష్ ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్రాండెడ్ స్కిన్ కేర్ ఉత్పత్తులు అధిక ధరలకు విక్రయించబడుతుండటంతో చాలామంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలో రాజీ పడకుండా తక్కువ ధరలోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. జనౌషధి కేంద్రాల ద్వారా ఇప్పటికే అనేక రకాల మందులు, ఆరోగ్య ఉత్పత్తులు చవక ధరల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే.
జనౌషధి కేంద్రాల్లో ప్రస్తుతం 1, 2 శాతం సెలైసిలిక్ యాసిడ్ కలిగిన ఫేస్‌వాష్‌లు విక్రయిస్తున్నారు. 1 శాతం ఫేస్‌వాష్ ధర రూ.46.88 కాగా.. 2% ఫేస్‌వాష్ ధర రూ.65.63 మాత్రమే. మార్కెట్‌లో ఇదే తరహా ఉత్పత్తులు దీనికంటే ఎక్కువ ధరలకు లభిస్తుండగా, జనౌషధి ద్వారా ఇవి చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రావడం విశేషం. సెలైసిలిక్ యాసిడ్ చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మంపై పేరుకునే డెడ్ స్కిన్‌ను తొలగించి కొత్త కణాల ఏర్పాటుకు తోడ్పడుతుంది. దీంతో మొటిమలు తగ్గడమే కాకుండా కొత్తగా మొటిమలు రావడం కూడా కొంతవరకు నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు.
జనౌషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే స్కిన్ కేర్ ఉత్పత్తులు అందుబాటులోకి రావడంపై ప్రజలు, ఆరోగ్య నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు, ఉద్యోగినులు, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పలువురు అభినందిస్తున్నారు.
అయితే ప్రతి ఒక్కరి చర్మ తత్వం ఒకేలా ఉండదు. కాబట్టి తీవ్రమైన మొటిమలు, అలర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నవారు స్వయంగా వాడకుండా ముందుగా చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సరైన విధంగా ఉపయోగిస్తే సెలైసిలిక్ యాసిడ్ ఫేస్‌వాష్ చర్మాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు మొటిమల నియంత్రణలో కూడా సహాయపడుతుంది.




