జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు క్రమంగా బీజేపీ-హిందుత్వ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన బ్రదర్, జనసేన అధ్యక్షుడు బీజేపీతో జట్టుకట్టిన నేపథ్యంలో నాగబాబు హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నారనే దానికి చాలా ఉదాహరణలు గోచరిస్తున్నాయి
మొన్నటికి మొన్న జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను పట్టుకొని అసలైన దేశభక్తుడని నాగబాబు కొత్త అర్థం చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినీ,రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఇక అది మరిపోకముందే.. చైనా మీద పడ్డారు నాగబాబు. మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులు, సెల్ ఫోన్లు, మొబైల్ యాప్స్ ను బహిష్కరిద్ధాం అంటూ నాగబాబు పిలుపునిచ్చారు. మన దేశంలోనే తయారైన వస్తువులను కొందామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మనదేశం పెద్ద మార్కెట్ అని.. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కశ్మీర్ లో హత్యకు గురైన హిందూ పండింట్ విషయంలో సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపారు. నాగబాబు ట్వీట్ చేస్తూ.. ‘‘నాకు నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు. ఫరవాలేదు… చచ్చింది హిందూ పండిట్ కదా. చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు. ఎక్కడో కాశ్మీరీ పండిట్, మనచుట్టం కాదు మన స్టేట్ కాదు.. ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియా లో కూడా స్పందించారు’’ అంటూ భారతీయ హిందూ పండిట్ హత్యపై నిప్పులు చెరిగారు. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది’ అంటూ నాగబాబు తన అసహాయతను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
ఇక తన ట్వీట్ లో బీజేపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు.. ‘నాకు తెలిసి హిందు దేశం లో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్. ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తులు పాలనలో నలిగి పోయాం. బ్రిటిష్ పాలన లో.. స్వతంత్రమ్ వచ్చాక కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం. ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానం గా చూసే ఒక పార్టీ పాలన లో ఉన్నాం’ అంటూ బీజేపీకి మద్దతుగా ట్వీట్ చేశారు నాగబాబు..
ఇలా మెగా బ్రదర్ నాగబాబు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకెళుతున్నట్టు చూస్తే అర్థమవుతోంది. ఆయన హిందుత్వ వాదాన్ని తెరపైకి తెస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే సమస్యలపై స్పందించే కోణాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినా.. బీజేపీకి దగ్గరి చేసే వ్యాఖ్యలు చేయడమే ప్రతిపక్షాల్లో అనుమానాలకు తావిస్తోంది. దీన్ని బట్టి బీజేపీతో జట్టుకట్టిన జనసేన పార్టీ కమలం పార్టీకి దగ్గర కావడానికే ఇలా ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.