Nagarjuna villain Character In Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి ఒక్క టీజర్ కానీ, ఒక్క పాట కానీ విడుదల కాలేదు. కేవలం ఒక చిన్న బిట్ టీజర్ ని మాత్రమే వదిలారు. ఆ బిట్ టీజర్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసింది. పూర్తి స్థాయి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు లో కూడా ఈ సినిమా గురించి ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కూడా ఒక కీలక పాత్ర పోషించాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఇందులో ఆయన ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేసాడు అని మాత్రమే సమాచారం ఉంది కానీ, అది పాజిటివ్ క్యారక్టరా?, లేకపోతే నెగెటివ్ క్యారక్టరా? అనేదానిపై అభిమానుల్లో స్పష్టత ఉండేది కాదు. కానీ ‘కుబేర’ ప్రొమోషన్స్ లో భాగంగా నాగార్జున ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాలో తాను పోషించిన క్యారక్టర్ పై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ఆయన మెయిన్ విలన్ క్యారక్టర్ చేసానని ఖరారు చేసాడు. ఈ క్యారక్టర్ గురించి ఆయన మాట్లాడుతూ ‘లోకేష్ కనకరాజ్ నన్ను కలిసి సార్ కూలీ సినిమాలో విలన్ క్యారక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతేనే చేయండి, లేకపోతే ఒక కప్ టీ తాగి వెళ్ళిపోదాం అని అన్నాడు. ముందు నాకు స్క్రిప్ట్ వినిపించు అని చెప్పాను. అతను స్క్రిప్ట్ మొదలు పెట్టిన కాసేపటికే నా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఆ రేంజ్ సన్నివేశాలు రాసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే అక్కినేని అభిమానులు మాత్రం నాగార్జున విలన్ క్యారక్టర్ చేయడం పై చాలా అసంతృప్తి తో ఉన్నారు. కేవలం ఈ ఒక్క సినిమాతో ఇది ఆగదని, రాబోయే రోజుల్లో డైరెక్టర్స్ నాగార్జున ని ఇలాంటి రోల్స్ లో చూపించేందుకు క్యూలు కడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క తన సమకాలీన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ భారీ వసూళ్లను రాబడుతున్న ఈ రోజుల్లో, తమ అభిమాన హీరో నాగార్జున ఇలా అయిపోవడం బాధకు గురి చేస్తుందని అంటున్నారు. ‘కూలీ’ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసిన వెంటనే ఆయన్ని ‘జైలర్ 2’ మేకర్స్ కూడా విలన్ క్యారక్టర్ కోసం సంప్రదించారట. ఆలోచించుకొని త్వరలోనే చెప్తానని నాగార్జున ‘జైలర్ 2’ మేకర్స్ కి చెప్పాడట. చూస్తుంటే ఇక మీదట ఆయన తన కెరీర్ లో కొత్త చాప్టర్ ని తెరిచినట్టుగా అనిపిస్తుంది.