Mookuthi Amman 2 Review : దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయనతార చిత్రం ముక్కుతి అమ్మన్ 2 (మహాశక్తి) తీవ్ర నిరాశను మిగిల్చింది. భారీ తారాగణం, అగ్రశ్రేణి దర్శకుడు, దేవతా నేపథ్యంలో సాగే కథ.. ఇలా సినిమాపై అంచనాలు పెంచే అంశాలన్నీ ఉన్నప్పటికీ, తెరపై మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక్క అంశం కూడా కనిపించలేదని సమీక్షలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, కథనం, కామెడీ, నటన.. ఇలా అన్ని విభాగాల్లోనూ సినిమా తడబడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నయనతార నటించిన ‘ముక్కుతి అమ్మన్’ మంచి విజయాన్ని అందుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి అంశాలతో పాటు సామాజిక వ్యంగ్యం, వినోదాన్ని మేళవించడం తొలి భాగానికి ప్రధాన బలంగా నిలిచింది. దీంతో రెండో భాగంపై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈసారి దర్శకత్వ బాధ్యతలను సుందర్ సి చేపట్టారు. నయనతార ప్రధాన పాత్రలో నటించగా, రెజీనా కసాండ్రా ప్రతినాయికగా కనిపించారు. కన్నడ నటుడు దునియా విజయ్ కీలక ప్రతినాయక పాత్ర పోషించారు. ఊర్వశి, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఖుష్బూ సుందర్, స్నేహ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దీపావళి సందర్భంగా సినిమా విడుదలైంది.
కథేంటి?
సుమారు 2,000 ఏళ్ల క్రితం భైరా (రెజీనా కసాండ్రా) అనే మంత్రగత్తె తన ప్రియుడు రణధీరన్ (దునియా విజయ్)తో కలిసి ప్రపంచాన్ని శాసించాలని భావిస్తుంది. అయితే గ్రామ దేవత ముక్కుతి అమ్మన్ (నయనతార)తో జరిగిన పోరాటంలో రణధీరన్ మరణిస్తాడు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన భైరా.. తిరిగి జన్మించి ముక్కుతి అమ్మన్‌పై పగ తీర్చుకోవాలని సంకల్పిస్తుంది. తొమ్మిది గ్రహాలు ఒకే రేఖలోకి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంది. మరి భైరా తన ప్రతీకారాన్ని తీర్చుకుందా? ముక్కుతి అమ్మన్ ఆమెను ఎలా ఎదుర్కొంది? అన్నదే మిగతా కథ.
నటీనటులున్నా.. నటనలో జీవం లేదు!
నయనతార, రెజీనా కసాండ్రా తెరపై ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వారి పాత్రలకు బలమైన రైటింగ్ లేకపోవడంతో పెద్దగా ప్రదర్శించే అవకాశం దక్కలేదు. ముఖ్యంగా రెజీనా పాత్ర ప్రతి సన్నివేశంలోనూ అరుస్తూ కనిపించడం కొంతసేపటికే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది.
దునియా విజయ్, ఊర్వశి, యోగిబాబు వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నప్పటికీ, వారి పాత్రలు కథకు ఏమాత్రం బలాన్ని చేకూర్చలేకపోయాయి. కామెడీతో నవ్వించాల్సిన యోగిబాబు, ఊర్వశి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. దాదాపు ప్రతి నటుడి ప్రదర్శనలోనూ ఉత్సాహం కొరవడినట్లు కనిపిస్తుంది.
ఏఐ విజువల్స్‌తో సినిమా నాణ్యతకు దెబ్బ!
ఈ సినిమాపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న విభాగం విజువల్ ఎఫెక్ట్స్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన భక్తి, ఫాంటసీ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్, అబ్బురపరిచే విజువల్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో కనిపించిన విజువల్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్ సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాణ్యత ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే గ్రీన్ మ్యాట్‌పై చిత్రీకరించి, ఏఐ సాయంతో విజువల్స్ రూపొందించినట్లుగా అనిపిస్తుందని సమీక్షలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లోనూ ఇంతకంటే మెరుగైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండేవని విమర్శించారు.
మగధీర సీన్ గుర్తొచ్చేలా కథనం!
సినిమాలో నయనతార, దునియా విజయ్ తొలిసారి ఎదురుపడే సన్నివేశంలో వారి శరీరాల్లో ఒకరకమైన ప్రకంపనలు కలిగినట్లు చూపిస్తారు. ఈ సన్నివేశం చూస్తుంటే తెలుగు బ్లాక్‌బస్టర్ ‘మగధీర’ గుర్తుకు వస్తుందని సమీక్షలో అభిప్రాయపడ్డారు. సినిమాలోని కొన్ని ఆలోచనలు, సన్నివేశాలు కొత్తదనం లేనివిగా అనిపిస్తాయని విమర్శించారు.
ఇక సుందర్ సి సినిమాల్లో సాధారణంగా కామెడీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. కథ ఎంత సీరియస్‌గా సాగినా మధ్యమధ్యలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. కానీ ‘ముక్కుతి అమ్మన్ 2’లో మాత్రం ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వించలేకపోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సుదీర్ఘ కామెడీ ఎపిసోడ్ సైతం విసుగు తెప్పిస్తుందని సమీక్ష పేర్కొంది.
సాంకేతిక విభాగాల్లోనూ నిరాశే!
హిప్‌హాప్ తమిజా సంగీతం, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్, గోపీ అమర్‌నాథ్ సినిమాటోగ్రఫీ.. ఇలా ఏ విభాగం కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవలేకపోయింది. ముఖ్యంగా దేవతా నేపథ్యంలో సాగే కథలో భక్తిభావాన్ని, దైవిక అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో దర్శకుడు విఫలమయ్యారని విమర్శించారు.
మూడు దేవతా పాత్రలు ప్రధానంగా ఉన్నప్పటికీ, కనీసం ఒక్క సన్నివేశంలోనూ దైవత్వాన్ని బలంగా ఆవిష్కరించలేకపోయారని సమీక్ష అభిప్రాయపడింది.
మొదటి భాగానికి వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ‘ముక్కుతి అమ్మన్ 2’ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కథలో కొత్తదనం లేకపోవడం, పేలవమైన కామెడీ, నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్, ఆసక్తి లేని కథనం సినిమాకు ప్రధాన ప్రతికూలతలుగా మారాయి. నయనతార, సుందర్ సి వంటి పేరున్న వ్యక్తులు పనిచేసినప్పటికీ ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
అమ్మవారి మహిమను చూపించడంలోనూ, ప్రేక్షకులను నవ్వించడంలోనూ విఫలమైన సినిమా. థియేటర్‌లో చూడాల్సినంత విషయం ఇందులో లేదనేది సమీక్షకుడి అభిప్రాయం.
ఓకే తెలుగు రేటింగ్: 1/5