దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చి ఏడాది గడిచిపోయింది. ఆ మహమ్మారి కట్టడిలో ఎన్నో కష్టాలు పడ్డాం. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నాం. జిందగీ ఇప్పుడిప్పుడు మామూలు అయింది. కానీ, చిన్న నిర్లక్ష్యం మళ్లీ మన వాకిట్లోకి కరోనాను తీసుకొస్తోంది. వ్యాక్సిన్లు వచ్చేశాయన్న భరోసా కావొచ్చు.. బతుకు బండి నడవాలంటే రిస్క్ చేయక తప్పదన్న ఆలోచనా కావొచ్చు.. చాలా మంది కరోనా గురించి పట్టించుకోవట్లేదు. కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. సోషల్ డిస్టెన్స్సంగతి దేవుడెరుగు.. ఎక్కడికక్కడ జనాలు గుమిగూడుతున్నారు. ఆడంబరంగా ఫంక్షన్లు చేసుకుంటున్నారు. వాటికి తోడు ఎన్నికలు. దీంతో కరోనా గేర్లు మార్చి జోరందుకుంటోంది.
Also Read: పార్టీల మధ్య కొట్లాట పెడుతున్న ఎస్ఈసీ
* మహారాష్ట్ర, కేరళలో విజృంభణ
కేసులు తగ్గుతున్నాయని సంబరపడే లోపే మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్నాటక వంటి రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే కరోనా ముప్పు ఇంకా పోలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు అంతటా దాదాపు అన్నీ ఓపెన్ అయిపోయాయి. రద్దీ భారీగా పెరిగిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరికొన్ని రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో కరోనా కట్టడి కాడిని వదిలేస్తే సెకండ్ వేవ్ ముప్పు తప్పదని, కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
* నిన్న ఒక్క రోజే 13,913 కేసులు
నిన్నటి లెక్కలు ఒకసారి చూస్తే దేశంలో కొత్తగా 13,193 మంది కరోనా బారిన పడ్డారు. 19 రోజుల తర్వాత (దాదాపు మూడు వారాలు) మళ్లీ 13 వేల కన్నా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 97 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 9 లక్షల 63 వేల 394కి చేరింది. లక్షా 56 వేల 111 మంది బలయ్యారు. కోటీ 6 లక్షల 67 వేల 741 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 97.3 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశం మొత్తంలో లక్షా 39 వేల 542 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం కరోనాతో చనిపోయిన వాళ్లలో కేవలం మహారాష్ట్రకు చెందినోళ్లు 38, కేరళ వాళ్లు 14 మంది ఉన్నారంటేనే ఆ రాష్ట్రాల్లో పరిస్థితి మళ్లీ తీవ్రమవుతోందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం కేసుల్లో ఆ రెండు రాష్ట్రాల్లో నుంచే 75 శాతం కేసులు వస్తున్నాయి.
* మళ్లీ మహారాష్ట్రలోనే కేసులెక్కువ
మొదట్నుంచి దేశంలో కరోనా కేసులకు మహారాష్ట్రే ఎపిసెంటర్‌గా ఉంది. ఇప్పటికీ అక్కడే మొత్తం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడూ ఎక్కువగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో వారంలో రోజూ సగటున 3 వేలకుపైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంతో పోలిస్తే రెండో వారంలో 14 శాతం ఎక్కువ మంది మహమ్మారి బారిన పడ్డారు. రెండో వారంలో 20,207 కేసులు నమోదైతే.. మొదటి వారంలో 17,672 మందికి పాజిటివ్ వచ్చింది. ముంబై, పుణే, నాగ్‌పూర్, ఠాణే, అమరావతిల్లోనే దాదాపు 60 శాతం కేసులు వచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే 5,427 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మధ్యే మహారాష్ట్ర సర్కార్లోకల్ట్రైన్లను ప్రారంభించింది. దానికి తోడు అక్కడ పంచాయతీ ఎన్నికలూ జరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడా రీజియన్లలో పోలింగ్‌శాతం 80కిపైగానే నమోదైంది. చాలా చోట్ల 70 శాతం దాకా పోలింగ్రికార్డైంది. ఎన్నికల ప్రచారమూ జోరుగా చేశాయి పార్టీలు. ఇక, పెళ్లిళ్లు, ఫంక్షన్ల గురించి చెప్పనక్కర్లేదు. 50 మంది గెస్టులనే పిలుచుకోవాలన్న రూల్ ఉన్నా.. 500 మంది దాకా గెస్టులను పిలుచుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కరోనా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* రోల్ మోడల్ కేరళకు ఏమైనట్లు..?
కరోనా వచ్చిన మొదట్లో మహమ్మారి కట్టడికి కేరళ ఎన్నో చర్యలు తీసుకుంది. మిగతా రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచింది. కానీ, ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. రోజూ నమోదవుతున్న కేసుల్లో 44 శాతం అక్కడే వస్తున్నాయి. దానికి కారణం జనాల నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వ అతి నమ్మకమూ కారణమైందని హెల్త్ ఎక్స్పర్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయకుండా కేవలం యాంటీజెన్ టెస్టులపైనే ఆధారపడడమూ మరో కారణమని చెబుతున్నారు. ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరులో రెండు కొత్త కరోనా క్లస్టర్లను అధికారులు గుర్తించారు. ఆర్టీ నగర్‌లోని మంజూశ్రీ నర్సింగ్ కాలేజీలో కేరళకు చెందిన 42 మంది స్టూడెంట్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో నిర్వహించిన బర్త్ డే పార్టీ ద్వారా 103 మందికి కరోనా వచ్చింది. దీంతో అధికారులు వాటిని కంటెయిన్మెంట్జోన్లుగా ప్రకటించారు. కేరళ నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చిన సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. మరోవైపు 22 నుంచి ఆరో క్లాసుకు పైన ఉన్న అన్ని తరగతులకు స్కూల్స్‌ను ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతోంది. హాస్టళ్లలో ఉండే కేరళ స్టూడెంట్లు మాటిమాటికీ సొంతూరుకు పోవడం మానేయాలని ఆదేశించింది.
Also Read: జగన్ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా..?
* ఎన్నికల వేళ జాగ్రత్త సుమా
ప్రస్తుతం పశ్చిమబెంగాల్, అస్సాంతో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపాటి చిన్న నిర్లక్ష్యం ప్రదర్శించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
* కొత్త వేరియంట్లు డేంజరే
ప్రస్తుతం మన దగ్గరా బ్రిటన్(కెంట్), సౌతాఫ్రికా, బ్రెజిల్రకం కరోనా కేసులూ నమోదయ్యాయి. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ఇప్పటిదాకా ఆ కొత్త రకం కరోనా కేసులు 192 దాకా వచ్చాయి. దీంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెంట్, సౌతాఫ్రికా రకాల వైరస్‌లతో చాలా ప్రమాదమని ఇప్పటికే హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరించారు. వాటితో కేసులు వేగంగా పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి టైంలో కనీస జాగ్రత్తలు పాటించకపోతే కరోనాతో పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
* లోకల్ ట్రైన్లలో మార్షల్స్
జనాలు మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో లోకల్ట్రైన్లలో 300 మంది మార్షల్స్‌ను పెట్టాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ముంబై సిటీలో మాస్కులు పెట్టుకోని వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులను రంగంలోకి దించారు. ఇంట్లో క్వారంటైన్ అయ్యేవాళ్ల చేతులపై క్వారంటైన్స్టాంప్ వేయనున్నారు. ఓ బిల్డింగ్‌లో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ కేసులు వస్తే.. ఆ బిల్డింగ్ మొత్తాన్ని కంటెయిన్ చేయనున్నారు. రూల్స్‌ను పట్టించుకోని వారిని గుర్తించేందుకు ఎక్కడికక్కడ అధికారులు సడన్ చెకింగ్లు చేయనున్నారు. మొత్తంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కరోనా జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఆ ముప్పు బారి నుంచి బయటపడలేం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Corona virus spreading again in the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com