Kushal Reddy – Chahak Jain: ఓటమిని చాలామంది గెలుపుకు నాంది అని అంటుంటారు. కాకపోతే చాలామంది ఓడిపోవడాన్ని నామోషీగా భావిస్తూ ఉంటారు. ఓటమి ద్వారా వచ్చిన పాఠాన్ని గెలుపుకు సోపానంగా మార్చుకోవడంలో వెనుక పడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ ఓటమి ద్వారా సాధించిన అనుభవాన్ని.. గెలుపుకు అవకాశం లాగా మార్చుకుంటారు. ఆ జాబితాలో ఈ దంపతులకు మొదటి స్థానం ఉంటుంది.
అతడి పేరు కుశాల్ రెడ్డి.. ఆమె పేరు చాహక్ జైన్. వీరిద్దరూ ఉండేది బెంగళూరులో.. ఉన్నత చదువులు చదివారు. కాకపోతే ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక.. వ్యాపార మొదలుపెట్టారు. సరిగ్గా నాలుగు లక్షల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేశారు. అది విపరీతమైన నష్టాలను తీసుకొచ్చింది. క్లౌడ్ కిచెన్ కోసం తెచ్చిన అప్పులను తీర్చడానికి వారికి చాలా సమయం పట్టింది.
ఈ దశలో చాలామంది రకరకాలుగా మాటలు చెప్పారు. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా.. ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలుపెట్టారు. కేవలం 10 నెలల కాలంలోనే రెండు కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ దంపతులు సరిగా రెండు సంవత్సరాల క్రితం బెంగళూరులో జేపీ నగర్ ప్రాంతంలో క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టారు. ఫుడ్ డెలివరీ యాప్స్ అధిక కమిషన్లు వసూలు చేయడం.. ప్రకటనల కోసం భారీగా ఖర్చులు పెట్టడం.. రోజుకు కేవలం మూడు మాత్రమే ఆర్డర్లు రావడంతో.. కేవలం ఐదు నెలల కాలంలోనే ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది.
ఆ ఓటమి నుంచి ఈ దంపతులు త్వరగానే పాఠం నేర్చుకున్నారు. క్లౌడ్ కిచెన్ కోసం తెచ్చిన అప్పులను తీర్చేశారు. ఆ తర్వాత స్నేహితులు.. ఇతర కుటుంబ సభ్యుల దగ్గర నుంచి దాదాపు 20 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలో ఒక కార్గో ట్రక్కును కొనుగోలు చేశారు.. తమిళనాడు రాష్ట్రంలో దానిని పూర్తిస్థాయిలో కిచెన్ లాగా మార్చారు.
ఫుడ్ ట్రక్ సిద్ధమవుతున్న నేపథ్యంలో దానిని మొత్తం చాహక్ రీల్స్ రూపంలో డాక్యుమెంట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడికి ఐదు వేలకు మందికి పైగా ఫాలోవర్లు నమోదయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ లో జేపీ నగర్ ప్రాంతంలో ఈ దంపతులు ఫుడ్ ట్రక్ మొదలుపెట్టారు. మొదటి రోజే వందమందికి పైగా కస్టమర్లు వచ్చారు. ఇక మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 30 వేలకు పైగా విక్రయాలు జరిగాయి. ఇక ప్రస్తుతం ఈ ఫుడ్ ట్రక్ రోజుకు 450 మంది దాకా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతిరోజు అమ్మకాల ద్వారా లక్ష వరకు ఆర్జిస్తున్నది. వీరి మెనులో ముఖ్యంగా పన్నీర్ బర్గర్.. చికెన్ పాప్కార్న్.. ఫ్రైడ్ చికెన్ వంటివి ఉన్నవి. ఇందులో 13 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే తమ బ్రాండ్ ను త్వరలోనే ఫాస్ట్ క్యాజువల్ రెస్టారెంట్ గా మార్చుతామని.. సెంట్రల్ కిచెన్ గా విస్తరిస్తామని కుషాల్ రెడ్డి దంపతులు చెబుతున్నారు.