Best Emergency Fund Options: జీవితంలో ఎప్పుడు ఏ ఆర్థిక సమస్య వస్తుందో చెప్పలేం. ఉద్యోగం కోల్పోవడం, ఆకస్మిక వైద్య ఖర్చులు, కుటుంబ అత్యవసరాలు, వ్యాపార నష్టాలు వంటి పరిస్థితుల్లో అప్పులు చేయకుండా నిలబడేందుకు ప్రత్యేకంగా దాచుకునే డబ్బునే ‘ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Fund)’ అంటారు. ఇది పెట్టుబడి కంటే భద్రత కోసం ఉంచే నిధి. సాధారణంగా కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌గా ఉంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. ఉద్యోగం స్థిరంగా లేకపోతే లేదా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటే 9 నుంచి 12 నెలల ఖర్చుల వరకు కూడా సేవ్ చేయడం మంచిదని చెబుతున్నారు. అసల దీనిని ఏ విధంగా దాచుకోవాలి.
చాలా మంది అత్యవసర నిధిని బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుతారు. దీనివల్ల డబ్బు ఎప్పుడైనా వెంటనే తీసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే సాధారణ సేవింగ్స్ అకౌంట్లలో వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న సమయంలో ఆ డబ్బు విలువ క్రమంగా తగ్గిపోతుంది. అంటే డబ్బు సేఫ్‌గా ఉన్నా, అది పెద్దగా పెరగదు. అయినప్పటికీ తక్షణ అవసరాలకు కొంత మొత్తం సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచడం మాత్రం అవసరమే.
కొంతమంది ఎక్కువ వడ్డీ వస్తుందని మొత్తం ఎమర్జెన్సీ ఫండ్‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లో పెడతారు. FDలలో సేవింగ్స్ అకౌంట్ కంటే మెరుగైన వడ్డీ లభిస్తుంది. కానీ ఇక్కడ సమస్య లిక్విడిటీ. అనుకోని సమయంలో డబ్బు అవసరమైతే FDను మధ్యలో బ్రేక్ చేయాల్సి వస్తుంది. దీంతో పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్ సేవింగ్ FDలు అయితే 5 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది. అందుకే మొత్తం ఎమర్జెన్సీ ఫండ్‌ను FDల్లో మాత్రమే ఉంచడం సరైన పద్ధతి కాదు.
మరి బెస్ట్ ఆప్షన్ ఏది?
ఆర్థిక నిపుణులు సూచించే ఉత్తమ మార్గం ‘మిక్స్ స్ట్రాటజీ’. అంటే ఎమర్జెన్సీ ఫండ్ మొత్తాన్ని ఒక్క చోట కాకుండా వేర్వేరు సాధనాల్లో విభజించి పెట్టడం. ఉదాహరణకు ఒక నెల ఖర్చులకు సరిపడే మొత్తం సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచాలి. మరో భాగాన్ని ఫ్లెక్సీ FD లేదా స్వల్పకాలిక FDల్లో ఉంచాలి. మిగతా మొత్తాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో పెట్టవచ్చు. ఇలా చేస్తే అవసరమైనప్పుడు డబ్బు అందుబాటులో ఉండటమే కాకుండా కొంత రాబడి వస్తుంది.
ఫ్లెక్సీ FD అంటే ఏమిటి?
ప్రస్తుతం చాలా బ్యాంకులు ‘ఫ్లెక్సీ ఫిక్స్‌డ్ డిపాజిట్’ లేదా ‘ఆటో స్వీప్ అకౌంట్’ సదుపాయం ఇస్తున్నాయి. ఇందులో ఖాతాలో ఒక నిర్దిష్ట మొత్తానికి మించి ఉన్న డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు తిరిగి సేవింగ్స్ ఖాతాకు వస్తుంది. దీంతో సేవింగ్స్ అకౌంట్ లిక్విడిటీ కూడా ఉంటుంది, FD వడ్డీ ప్రయోజనం కూడా లభిస్తుంది. అత్యవసర నిధులకు ఇది మంచి ఎంపికగా భావిస్తున్నారు.
ఎమర్జెన్సీ ఫండ్‌లో కొంత మొత్తాన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం కూడా మంచి ఆప్షన్‌గా భావిస్తారు. ఇవి తక్కువ రిస్క్ ఉన్న డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెడతాయి. సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ కంటే కొంచెం ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా 24 గంటల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవి మార్కెట్ ఆధారిత పెట్టుబడులు కావడంతో పూర్తిగా రిస్క్ ఫ్రీ కావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
