Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Legal Battle: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ న్యాయ పోరాటం!

YSRCP Legal Battle: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ న్యాయ పోరాటం!

YSRCP Legal Battle: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థ మెటా వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీని తొలగించింది. భారత దేశ డిజిటల్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీ ఉండడంతోనే ఈ చర్యలకు దిగినట్లు మెటా స్పష్టం చేసింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు దానిపై న్యాయ పోరాటానికి దిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులో పిటీషన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫేస్బుక్ అకౌంట్ ను ప్రభుత్వ ఆదేశాలతో బ్లాక్ చేసినప్పుడు.. సదరు ఆదేశాల కాపీని ఖాతాదారుడికి ఇవ్వాల్సి ఉంది అని వాదించారు. అందుకే ఈ పిటిషన్ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులను, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ వ్యవహారం సంచలనమే. అత్యంత సాహసమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినంత పనిచేస్తూ న్యాయపోరాటం ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పు పట్టింది వైసిపి. దానికి కూటమి ప్రభుత్వం ధీటుగానే స్పందించింది. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరింది. ఇప్పుడు అదే పని చేసింది వైసిపి.

పెద్ద ఎత్తున ఫిర్యాదులతోనే..
అంతర్జాతీయంగా సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలు చూస్తోంది మెటా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో పెడుతున్న పోస్టులు అభ్యంతరకరంగా, అశ్లీలతగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. భారత ప్రభుత్వ డిజిటల్ మీడియా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఫేస్బుక్ పేజీ ఉంటుందంటూ అభ్యంతరాలు వెళ్లడంతో మెటా ఆ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసింది. ఒక విధంగా ఆ పార్టీకి ఇది షాకింగ్ పరిణామమే. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏకంగా న్యాయపోరాటానికి ఆ పార్టీ దిగడం చూస్తుంటే.. ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం అవుతోంది. ఈరోజు కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.