Homeఆంధ్రప్రదేశ్‌Perni Nani: పవన్ ను విమర్శిస్తే ఊరుకోను.. పేర్ని నాని హెచ్చరిక!

Perni Nani: పవన్ ను విమర్శిస్తే ఊరుకోను.. పేర్ని నాని హెచ్చరిక!

Perni Nani: దెబ్బ తగిలే దాక గాయం బాధ తెలియదంటారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను ఇప్పుడు సమీక్షించుకుంటుంది. కొన్ని వర్గాల విషయంలో తాము అనుసరించిన తీరును గుర్తు చేసుకుంటుంది. తప్పిదాలను సరి చేసుకునే పనిలో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో స్ట్రాటజీ మార్చినట్లు స్పష్టమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడం వల్లే కాపులు తమకు దూరమయ్యారన్న విషయాన్ని గ్రహించింది. ఇకముందు ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలని భావిస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కాపు ఆత్మీయ సమావేశాల పేరుతో వైసిపి కాపు నాయకులు సమావేశం అవుతున్నారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మారిన వైసీపీ వైఖరిని అది స్పష్టం చేస్తోంది.

* అదేపనిగా అవమానపరిచి..
2019లో అఖండ మెజారిటీతో విజయం సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జనసేన ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అది మొదలు పవన్ కళ్యాణ్ పై వీరవిహారం చేసింది వైయస్సార్ కాంగ్రెస్. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాపులు అండగా నిలవలేదు. అయినా అదే పనిగా వైసిపి నేతలు పవన్ కళ్యాణ్ ను అవమానపరచడంతో.. కాపుల్లో ఒక రకమైన ఆవేదన ప్రారంభం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో పాటు పవన్ కళ్యాణ్ పై విపరీతమైన సానుభూతి వ్యక్తం అయింది. అయితే ఈ విషయాన్ని గ్రహించని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పదునైన అస్త్రాలతో పవన్ పై వ్యక్తిగత దాడిని కొనసాగించింది. మాటల దాడి పెరిగే కొలది పవన్ కళ్యాణ్ పై కాపుల అభిమానం పెరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ద్వేషం పెరిగింది. 2024 ఎన్నికల నాటికి అది పతాక స్థాయికి చేరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసింది.

* ఎట్టకేలకు నష్టాన్ని గుర్తించి
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. కానీ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి తమకు నష్టం చేసిందన్న విషయాన్ని గ్రహించలేక పోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల కాపు అంశాన్ని ఇతివృత్తంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తనకు కులం పట్టింపులు లేవంటూ పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిని అస్త్రంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పవన్ పై సుత్తిమెత్తటి విమర్శలకే పరిమితం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇకనుంచి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు వద్దు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సూచించారు. ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే తాను చేస్తానని.. ఇది పార్టీ లైన్ అని చెప్పే ప్రయత్నం చేశారు నాని. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల వల్లే కాపులు దూరమయ్యారన్న విషయాన్ని గ్రహించింది వైసిపి. మరి తరువాత అడుగులు ఎలా వేయబోతుందో చూడాలి పవన్ విషయంలో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version