Marri Rajasekhar Announced Resign
YSR Congress : వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలకు కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులను గద్దె దించేందుకు శరవేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు, కేసులు పెరుగుతున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరైన నేత పార్టీకి రాజీనామా చేశారు. నిజంగా ఆ పార్టీకి షాకింగ్ పరిణామమే.
Also Read : జగనన్నది తప్పే.. చంద్రబాబుపై షర్మిల ఫైర్!
* పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత రాజీనామా ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్తో రాజకీయ ప్రయాణం చేసిన మాజీ ఎమ్మెల్యే.. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్( Marri Rajasekar) పార్టీకి రాజీనామా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసిపికి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణలు రాజీనామా చేశారు. ఇంతవరకు వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం ఉంది. అయితే టిడిపికి చెందిన ఓ మాజీ మంత్రి అభ్యంతరం తోనే ఆయన రాజీనామా చేయలేదని తెలుస్తోంది. టిడిపి హై కమాండ్ తో పాటు సదరు మాజీ మంత్రి నుంచి అనుమతి రావడంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
* 2004లో తొలిసారిగా..
ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభల్లో అడుగు పెట్టాలని మర్రి రాజశేఖర్ భావించారు. 2004లో చిలకలూరిపేట( chilakaluripeta ) నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు మర్రి రాజశేఖర్. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. ఇంతలో విడదల రజిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిని చేస్తానని రాజశేఖర్ కు హామీ ఇచ్చి తప్పించారు జగన్మోహన్ రెడ్డి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. పైగా విడదల రజనీకి మంత్రిగా అవకాశం ఇచ్చి.. రాజశేఖర్ ను మాత్రం అలానే ఉంచేశారు. దీంతో ఆయన లో అసంతృప్తి ప్రారంభం అయింది. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించారు రాజశేఖర్. కానీ గుంటూరు మేయర్ గా ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి అసంతృప్తికి గురయ్యారు.
* చాలా రోజులుగా ప్రచారం
వాస్తవానికి చాలా రోజుల కిందటే మర్రి రాజశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి( YSR Congress party ) గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. టిడిపిలో చేరుతారని టాక్ నడిచింది. అయితే ఇప్పటికే చిలకలూరిపేట ఎమ్మెల్యేగా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు. రాజశేఖర్ చేరికను ఆయన వ్యతిరేకించారు. పార్టీ హై కమాండ్ సముదాయించడంతో ఒప్పుకున్నారు. దీంతో మర్రి రాజశేఖర్ కు లైన్ క్లియర్ అయింది. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది.
Also Read : ఉచిత బస్సు కోసం ఇది మామూలు నిరసన కాదు..