Donald Trump and Elon Musk: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం చేస్తున్నాయి. దీంతో మధ్య ప్రాచ్యం లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇరాన్ ఇజ్రాయిల్ మీద మాత్రమే కాకుండా… గల్ఫ్ దేశాల్లోని దుబాయ్.. ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తోంది. దీంతో పరిస్థితి అంతకంతకు ఉద్రిక్తంగా మారుతోంది. ఇప్పటికే అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని హతమార్చింది. అంతేకాదు, ఇరాన్ మీద దాడులను తీవ్రతరం చేసింది. అత్యంత ఆధునికమైన మిస్సైల్స్ తో దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రాంతంలో పెద్దపెద్ద భవనాలు కూలి పోయాయి.
ప్రపంచంలో పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో అమలాపురంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తీరును ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఆయన వల్ల ప్రపంచం మొత్తం నాశనం అవుతుందని మండిపడ్డారు. అంతేకాదు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ వల్ల ఉపద్రవాలు వస్తున్నాయని.. అవి ప్రపంచంలో పెను మార్పులకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ” ట్రంప్, మస్క్ రాక్షసులు. అంగారక గ్రహంలో మస్క్ స్థిరాస్తి వ్యాపారం చేస్తారట. ట్రంప్ తన ఆధిపత్యం కోసం కనిపించే ప్రతి దేశం మీద దండయాత్ర చేస్తున్నారు. వీళ్ల వల్ల ప్రపంచం నాశనమవుతోంది. ట్రంప్, మస్క్ ను అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు రావాలని” గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు.
గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్, మస్క్ పై నరసింహారావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మస్క్ అనే వ్యక్తి వ్యాపారి. అతడు తన వ్యాపారం కోసం ఏమైనా చేస్తాడు. ఎలాంటి వ్యవహారాల కైనా పాల్పడతాడు. అందులో తప్పు పట్టవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక కు గ్రామం అయిపోయింది. అలాంటప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు. మస్క్ పెట్టు బడులు పెడుతున్నాడు కాబట్టి.. అన్ని దేశాలు అతడికి ఎర్రతివాచి పరుస్తున్నాయి. అలాంటప్పుడు మస్క్ చేసే దానిలో తప్పు ఏముంది? ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
గిట్టని దేశాలపై దాడులు చేస్తున్న ట్రంప్.. ప్రపంచ వాణిజ్యాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాడు. అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారు ఎవరైనా సరే ఇలానే వ్యవహరిస్తారు. చివరికి నల్ల జాతీయుడైన బరాక్ ఒబామా కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని కొనసాగించినవాడే. అలాంటప్పుడు గరికపాటి నరసింహారావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటి? వారిద్దరిని చెప్పడానికి మహావిష్ణువు రావాలని పిలుపునివ్వడమేంటి? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు మాదిరిగా ఆధ్యాత్మిక విషయాలను లోతుగా చెప్పాలని.. అంతేగాని ఇలా వివాదాస్పదమైన విషయాల జోలికి వెళ్లకూడదని గరికపాటి నరసింహారావు భక్తులు సూచిస్తున్నారు.