TDP Varma: పిఠాపురం టిడిపి ఇన్చార్జ్ వర్మ వైసీపీలో చేరతారా? పవన్ పై అసంతృప్తితో ఉన్నారా? పిఠాపురంలో పవన్ పాతుకు పోతారని భావిస్తున్నారా? అందుకే వైసీపీలో చేరడం ఉత్తమమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొద్దిరోజులుగా వర్మ వైసీపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు వర్మ. తన పరిస్థితి ఏమిటి? తాను ఏం చేయదలుచుకున్నది? వివరంగా చెప్పేశారు. దీంతో ఇదో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్రంలో సెలబ్రిటీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఇదే నియోజకవర్గంపై చర్చిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న కసితో వైసీపీ పని చేస్తోంది. పిఠాపురం లో ఎన్ని రకాల చేయాలో.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. అందుకే ఈసారి వైసిపి వర్మపై దృష్టి పెట్టింది. ఒక్క వర్మను తమ వైపు తిప్పుకుంటే.. పవన్ ఓటమి ఖాయమని అధికార పార్టీ డిసైడ్ అయ్యింది. అందుకే ఆయనకు ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది.
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా వర్మ ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి విజయం సాధించారు. అటువంటి వ్యక్తికి ఛాన్స్ లేదంటే సహజంగానే బాధ ఉంటుంది. పొత్తులో భాగంగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఆవేదనను వెలిబుచ్చారు. టిడిపి శ్రేణులు అయితే వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని కోరారు. అయితే చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడడంతో వర్మ మనసు మార్చుకున్నారు.పవన్ విజయానికి సమ్మతించారు. పిఠాపురంలో గట్టిగానే పనిచేస్తున్నారు. అయితే పిఠాపురంలో వైసిపి గ్రాఫ్ తగ్గడంతో ఆ పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది. వర్మపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
వంగా గీతను వర్మ కలిసినట్లు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగింది. అయితే దీని వెనుక వైసిపి వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. వర్మ విషయంలో జరుగుతున్న ప్రచారంతో కూటమి పార్టీల శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో వర్మ ప్రత్యేకంగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చేశారు. తాను చంద్రబాబు మనిషినని.. నాలుగు నెలల కిందటే పవన్ కళ్యాణ్ పరిచయం అయ్యారని.. ఆయన గెలిపిస్తానని చంద్రబాబుకు మాటిచ్చానని.. మాట తప్పే మనిషి కాదని చెప్పుకొచ్చారు. తనకోసం గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రయత్నం చేస్తూనే ఉందని.. తాను చంద్రబాబు మనిషి నన్న విషయం మరిచిపోకూడదన్నారు. పిఠాపురంలో పవన్ విజయం ఎవరు అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. మొత్తానికైతే ఫుల్ క్లారిటీ ఇచ్చారు.