Homeఆంధ్రప్రదేశ్‌BJP TDP Alliance: బిజెపి, తెలుగుదేశం పొత్తులో ట్విస్ట్

BJP TDP Alliance: బిజెపి, తెలుగుదేశం పొత్తులో ట్విస్ట్

బిజెపి రాకుంటే కాంగ్రెస్, వామపక్షాలు రెడీగా ఉన్నాయి. చంద్రబాబుకు వాటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగని బిజెపిని వదులుకుంటే గత ఎన్నికల పరిస్థితి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు.

BJP TDP Alliance: ఏపీలో విచిత్ర పొత్తులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. మరోవైపు జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షం. జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని బిజెపి చెబుతోంది. అయితే ఆ రెండు పార్టీలను కలుపుతానని పవన్ చెబుతున్నారు. బిజెపి హై కమాండ్ ఆలోచన మాత్రం వేరే రూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తప్పకుండా బిజెపి తనతో కలిసి వస్తుందని టిడిపి, జనసేనలు ఎదురుచూస్తున్నాయి. కానీ బిజెపి నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు. దీంతో ఆ రెండు పార్టీలకు ఎదురుచూపులు తప్పడం లేదు.

బిజెపి రాకుంటే కాంగ్రెస్, వామపక్షాలు రెడీగా ఉన్నాయి. చంద్రబాబుకు వాటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగని బిజెపిని వదులుకుంటే గత ఎన్నికల పరిస్థితి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే బిజెపిని ఒప్పించే ప్రయత్నాన్ని పవన్ కు అప్పగించారు. అయితే తాజాగా బిజెపి ఒక సర్వే చేసుకుందని.. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. జగన్ బలంగా ఉంటే ఒంటరి పోరుకు.. తెలుగుదేశం, జనసేన బలం పెరిగితే ఆ రెండు పార్టీలకు కలిసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త తరహా ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఎన్డీఏతో కలిసిన చంద్రబాబు.. ఆ రెండుసార్లు ఎన్డీఏ కు వెన్నుపోటు పొడిచారు. బయటకు వెళ్లిపోయారు. బిజెపిని ఏపీలో ఎదగనివ్వకుండా చేశారు. అందుకే ఈసారి పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిజెపి భావిస్తోంది. పొత్తులో భాగంగా బిజెపి, జనసేనకు సగం సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెడుతోంది. 70 నుంచి 80 సీట్లను రెండు పార్టీలకు ఇస్తేనే పొత్తు కుదుర్చుకుంటామని బిజెపి నుంచి ఒక ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఆ స్థాయిలో సీట్లు వదులుకుంటే తెలుగుదేశం పార్టీలో తప్పకుండా తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఆ ప్రతిపాదనకు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు కూడా. టిడిపి తో పొత్తు వద్దనుకునే బిజెపి ఈ ప్రతిపాదన చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు టిడిపి అనుకూల మీడియా పొత్తుపై మరో ప్రచారం మొదలు పెట్టింది. బిజెపితో పొత్తు విషయంలో టిడిపి, జనసేన పునరాలోచనలో పడ్డాయని.. బిజెపితో కలిసి వెళ్తే మైనారిటీలు దూరమయ్యే అవకాశం ఉందని.. అందుకే పొత్తు వద్దని.. ఎన్నికల అనంతరం అన్ని విధాల మద్దతు పలుకుతామని ఆ రెండు పార్టీలు బిజెపి అగ్రనేతలకు ఒప్పిస్తున్నట్లుగా ఎల్లో మీడియా రాసుకొస్తోంది. బిజెపి పెట్టిన సింహభాగం సీట్ల ప్రతిపాదన నచ్చక.. ఎన్నికల అనంతరం మద్దతు అంటూ కొత్త ప్రచారానికి తెర తీసినట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి అయితే బిజెపితో పొత్తు విషయంలో రోజుకో ట్విస్ట్ ఎదురవుతుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు చంద్రబాబు సైతం అయోమయానికి గురవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper