YS Sharmila: వైసీపీలో వైఎస్సార్ అంటే వారా? షర్మిల సెటైరికల్ కామెంట్స్ వైరల్!

ఎన్నికలనే యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నట్లు షర్మిల స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు సవాల్ చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర రాజకీయాలకు వచ్చినట్లు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే.. వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Written By: Dharma, Updated On : January 27, 2024 5:05 pm
Follow us on

YS Sharmila: వైఎస్ షర్మిల పంచ్ డైలాగులతో రెచ్చిపోయారు. ఈసారి వైసిపి కీలక నేతలను టార్గెట్ చేసుకున్నారు. ఒకవైపు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే.. మరోవైపు సెటైరికల్ గా మాట్లాడారు. పీసీసీ పగ్గాలు తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా షర్మిల పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెలాఖరు వరకు ఆమె పర్యటనలు కొనసాగనున్నాయి. అందులో భాగంగా ఆమె ఈరోజు ఒంగోలులో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీతో పాటు ఆ పార్టీ ప్రతినిధులు, కీలక నాయకులపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్నికలనే యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నట్లు షర్మిల స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు సవాల్ చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర రాజకీయాలకు వచ్చినట్లు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే.. వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఎక్కడ వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు. వైసీపీలో ఆ నలుగురే బాగుపడుతున్నారని.. వైసిపి పేరులో వైఎస్సార్ లేరని.. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని షర్మిల సెటైర్ వేశారు. కీలక నేతలను టార్గెట్ చేసేసరికి అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. అయితే షర్మిల తాజా కామెంట్స్ తో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

అటు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై షర్మిల విరుచుకుపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు. కనీసం ప్రాజెక్టు నిర్వహణను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రికి సంక్రాంతి డాన్సులు వేయడం తప్ప… ప్రాజెక్టుల బాగోగులను చూసే తీరుబాటు లేదని విమర్శించారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తే.. జగన్ సర్కార్ దానిని నిర్వహణను గాలికి వదిలేసిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పేవారు గుండ్లకమ్మను ఎందుకు పట్టించుకోలేదని.. కనీసం వూడిపోయిన గేట్లు కూడా బాగు చేయలేని మీరా వారసులు అంటూ జగన్ ను నిలదీశారు. జగన్ పాలనలో ప్రకాశం జిల్లా దారుణంగా నష్టపోయిందని ఆరోపించారు. మొత్తానికైతే ప్రభుత్వ వైఫల్యాల నుంచి వైసిపి పెద్దల బాగోతాల వరకు ఓ రేంజ్ లో షర్మిల విరుచుకుపడుతుండడం విశేషం.