YCP Fourth List: ఏపీ సీఎం జగన్ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తున్నారు. తప్పకుండా గెలుస్తారని భావిస్తున్న వారికి టిక్కెట్లు కట్టబెడుతున్నారు. ఇప్పటివరకు నాలుగు జాబితాలను ప్రకటించి 60 మంది అభ్యర్థులను మార్చారు. ఇటీవలే నాలుగో జాబితా ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగో జాబితా అభ్యర్థులను సైతం మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మిగనూరులో మాచాని వెంకటేష్ ను తప్పించి బుట్టా రేణుక, కర్నూలు ఎంపీ స్థానంలో గుమ్మనూరు జయరాం బదులు సిట్టింగ్ ఎంపీ బీవై రామయ్యను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఈసారి కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని జగన్ భావించారు. జయరాం స్థానంలో విరూపాక్షకు ఆలూరు ఇన్చార్జిగా నియమించారు. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు జయరాం విముఖత చూపుతున్నారు. ఆలూరు నుంచి మరోసారి పోటీ చేస్తానని తేల్చి చెబుతున్నారు. ఒకవేళ తనకు ఎంపీ సీటు ఇస్తే.. కుమారుడికి ఆలూరు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని హై కమాండ్ కు కోరుతున్నారు. వైసీపీ పెద్దలు ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. కొద్దిరోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పైగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ తో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గుమ్మనూరు జయరాం స్థానంలో సిట్టింగ్ ఎంపీ బివై రామయ్యను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.
ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రతిపాదించిన మాచాని వెంకటేష్ ను తొలుత ఇన్చార్జిగా ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కు అక్కడ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. 2014లో కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి రేణుక గెలిచారు. కానీ టిడిపిలోకి ఫిరాయించారు. గత ఎన్నికల్లో టిడిపి టికెట్ నిరాకరించడంతో వైసీపీలో చేరారు. అప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తికావడంతో ఆమెకు వైసీపీ సీటు దక్కలేదు. అందుకే ఈసారి ఎక్కడో చోట ఆమెను జగన్ సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు ఎంపీ సీటును ఆమెకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎమ్మిగనూరులో బీసీ అభ్యర్థి అయితే గెలుపొందుతారని ఒక అంచనాకు వచ్చి బుట్టా రేణుకకు ఖరారు చేశారు.
నరసరావుపేట ఎంపీ స్థానాన్ని ఈసారి బీసీలకు కేటాయించాలని జగన్ భావించారు. అందుకే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక్కడ బలమైన బీసీ అభ్యర్థిని బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే సరిపోతారని భావిస్తున్నారు. నెల్లూరు సిటీలో అనిల్ వెనుకబడ్డారు. ఈసారి పోటీ చేస్తే ఓటమి ఖాయమని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయనకు స్థానచలనం కల్పించనున్నారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించనున్నారు. ఆయన స్థానంలో ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రతిపాదనలో ఉంది. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.