https://oktelugu.com/

Chandrababu: ఇంతకీ ‘ఓటుకు నోటు’లో వాయిస్ ‘బాబు’దేనా కాదా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఏపీ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అప్పట్లో గులాబీ పార్టీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఆశ చూపిస్తున్నప్పుడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 27, 2024 / 05:03 PM IST
    Follow us on

    Chandrababu: అది 2015 వ సంవత్సరం. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఏడాది కి అటూ ఇటూ అవుతోంది. ఈ లోగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి.. అంతకుముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అప్పటి టిఆర్ఎస్ అంతంత మాత్రం మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కు , టిడిపి కి కూడా మంచి స్థానాలే వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ కు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సవాల్ గా మారాయి. అయితే ఆ ఎన్నికల్లో సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని అన్ని పార్టీలు తలపోశాయి. కానీ ఇందులో యాదృచ్ఛికంగా టిడిపి కొంత యాక్టివ్ పాత్ర పోషించింది. ఇది సహజంగానే కెసిఆర్ కు ఒకింత ఇబ్బందిగా అనిపించింది. అసలే రాజకీయాల్లో గండర గండడు కాబట్టి తెలివైన ఎత్తుగడకు తెర తీశాడు. అప్పటి టిడిపిలో కీలకంగా ఉన్న ఓ నాయకుడి ద్వారా వ్యవహారం నడిపాడు. సీన్ కట్ చేస్తే అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చుకుంటూ దొరికిపోయారని ఏసీబీ అభియోగాలు మోపింది. రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. స్టీఫెన్ సన్ అనే వ్యక్తి నుంచి వాంగ్మూలం సేకరించింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్యవహారంలో వినిపించిన మరో వ్యక్తి గొంతు మరొక ఎత్తు.

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఏపీ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అప్పట్లో గులాబీ పార్టీ నాయకులు ఆరోపించారు. అంతేకాదు స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఆశ చూపిస్తున్నప్పుడు.. ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడించాడని.. ఆ వ్యక్తి బ్రీఫ్డ్ మీ అని అన్నాడని.. అది ముమ్మాటికి చంద్రబాబు గొంతు అని.. ఆ మాట్లాడింది కూడా ఆయనే అని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే అప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ కాబట్టి.. వేరే అనుమానమే లేకుండా ఈ కేసును ఏసీబీతో దర్యాప్తు చేయించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ఆ కేసు కాస్త కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. అప్పటిదాకా తెలంగాణలో బలంగా ఉన్నట్టు కనిపించిన టిడిపి క్రమక్రమంగా బలహీనమైంది. కీలక నాయకులు పార్టీని వదిలిపెట్టి వెళ్లడంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అంతర్దానమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెరపైకి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నామని చెప్పినప్పటికీ.. అసలు వాస్తవం వేరే ఉంది.

    ఇక ఈ ఓటుకు నోటు కేసు నేపథ్యంలో ప్రఖ్యాత ఇండియా టుడే చంద్రబాబు నాయుడి ని ఇంటర్వ్యూ చేసింది. ఇండియా టుడే ఛానల్ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అప్పుడు చంద్రబాబు నాయుడి ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు మీరు డబ్బులు ఆశ చూపారు కదా? రేవంత్ రెడ్డి ద్వారా వ్యవహారం నడిపించారు కదా? రేవంత్ రెడ్డి మీకు ఫోన్ చేసి స్టీఫెన్ సన్ తో మాట్లాడించారు కదా? మీరు బ్రీఫ్డ్ మీ అని అన్నారు కదా? అని ప్రశ్నించగా.. ఇవన్నీ నాపై చేస్తున్న ఆరోపణలు.. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇలాంటివి సృష్టించడం మామూలు అయిపోయింది.. మా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉండనీయకుండా కుట్రలు చేస్తున్నారు. నాపై దర్యాప్తు చేయడానికి తెలంగాణ ఏసీబీ అధికారులు ఎవరు? తెలంగాణ ఏసీబీ అధికారులు కేసీఆర్ కనుసన్నల్లో పని చేస్తారు కాబట్టి.. ఈ దర్యాప్తులో నిష్పక్షపాతంగా జరగదని చంద్రబాబు రాజ్దీప్ సర్దేశాయ్ కి బదులిచ్చారు. తనను అనవసరంగా ఇందులో ఇరికిస్తున్నారని ఆరోపించారు.

    ఇలా ఆరోపణలు ప్రత్యారోపణల తర్వాత కేసు ఒక్కసారిగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళింది. అటు టిడిపి, ఇటు టిఆర్ఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అప్పట్లో ఈ కేసును పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఏసీబీ నుంచి ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోరారు.. అయితే దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు స్పందించింది. కేసు ఎందుకు విచారణకు నోచుకోవడం లేదని తెలంగాణ ఏసీబీ ని ప్రశ్నించింది. అదే సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు తెలంగాణ ఏసీబీ ఎటువంటి సమాధానం చెప్పలేదు.. అయితే ప్రస్తుతం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియా టుడే కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగాలు తెగ సర్కులేట్ చేస్తున్నాయి. అదే సమయంలో టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగాలు బలమైన కౌంటర్ ఇస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు సూచనతోనైనా తెలంగాణ ఏసీబీ ఈ కేసును సిబిఐకి బదిలీ చేస్తుందా? లేకుంటే రేవంత్ చెప్పినట్టు నడుచుకుంటుందా? కాలం గడిస్తే గాని ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.