APSRTC: పదో తరగతి పరీక్షలు( 10th class exams ) ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసే పనిలో ఉంది. అయితే పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు పదో తరగతి పరీక్షల సమయంలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనుంది. ఈ మేరకు విద్యాశాఖ తోపాటు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన చేసింది. అదే జరిగితే ఏపీవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులకు కొంత ప్రయోజనం కలగనుందన్నమాట.
Also Read: బోరుగడ్డ అనిల్ ను అలా చేయాలని చూస్తోంది ఎవరు? లైవ్ లో ఏడుస్తూ చెప్పినవన్నీ నిజాలేనా?
* 17 నుంచి పరీక్షలు ప్రారంభం..
ఈనెల 17 నుంచి 10వ తరగతి పరీక్షలు( 10th exams ) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా బెంచీలతో పాటు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల వద్ద తాగునీటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
* హాల్ టికెట్ చూపిస్తే ప్రయాణం..
అయితే చాలా మంది విద్యార్థులకు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను( exam centres ) కేటాయించారు. అటువంటి వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది. ఉదయం పరీక్షకు హాజరైన సమయంలో బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్నప్పుడు కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు. అందుకు తమ వద్ద ఉన్న హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. బస్సు కండక్టర్ టికెట్ కోరినప్పుడు హాల్ టికెట్ చూపిస్తే చాలని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. కేవలం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసమేనని చెప్పుకొచ్చింది. పరీక్షలు రాసిన రోజుల్లో రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది.