Pawan Kalyan and Vijay: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఎన్డీఏలో విజయ్ పార్టీ చేరుతుందా? పొలిటికల్ సర్కిల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత రెండు రోజులుగా దీనిపైనే మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార డిఎంకె కూటమి దూకుడు మీద ఉంది. మరోవైపు అన్నాడీఎంకేతో పాటు బిజెపి గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నాయి. ఈ తరుణంలో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ పాత్ర పై అనేక రకాల చర్చ నడుస్తోంది. విజయ్ చీల్చిన ఓట్లతో అధికార డిఎంకెకే ప్రయోజనం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఒక విధంగా భారతీయ జనతా పార్టీతో పాటు అన్న డీఎంకేకు కష్టమే. అందుకే కేంద్ర బిజెపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్లు ప్రచారం నడుస్తోంది.
బిజెపితో కలిసి ఎందుకు ససేమీరా
తమిళనాడులో( Tamilan Nadu ) హిందుత్వవాదంతో ముందుకు వెళ్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే అక్కడ ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ఉన్నాయి. హిందుత్వవాదంతో పాటు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అంశాలతో ముందుకు వెళ్తోంది బిజెపి. ద్రవిడ సిద్ధాంతాల నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు బిజెపితో కలిసి ఎందుకు ముందుకు రావడం లేదు. అయితే బిజెపి తమిళనాడులో బలం పెంచుకుంటూ వచ్చింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల పరంగా ఫలితాలు రాలేదు కానీ.. ఓట్ల పరంగా మాత్రం 14% దక్కించుకోవడం చిన్న విషయం కాదు. అందుకే ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవచ్చు అన్న ఆలోచనకు వచ్చింది భారతీయ జనతా పార్టీ.
కీలక చర్చలు..
ఆది నుంచి డిఎంకె( DMK ) వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్టు పరిస్థితి ఉండేది తమిళనాడులో. చివరకు కాంగ్రెస్ పార్టీ సైతం డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉండిపోయిందే కానీ రాజకీయంగా ఎదగలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. క్రమేపీ తన హిందుత్వవాదంతో బలంగా వెళ్ళింది. అయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా మిగతా రాజకీయ పార్టీలు బిజెపితో కలవవు. పరోక్ష రాజకీయ స్నేహానికే పరిమితం అవుతాయి. అయితే ఈసారి అన్నా డిఎంకెతో పాటు చిన్న చిన్న పార్టీలు బిజెపితో స్నేహం చేశాయి. కానీ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సైతం తటస్థంగా ఉంటే ఓట్లు చీలడం ఖాయం. అందుకే విజయ్ పార్టీని ఎన్డీఏలోకి తెచ్చేందుకు బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఒక సినీ నటుడుగా, బిజెపి స్నేహితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే తమిళనాడు బాధ్యతలు కట్టబెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే గత రెండు రోజులుగా విజయ్ తో పవన్ చర్చలు జరుపుతున్నారని.. కొలిక్కి వచ్చాయని.. ఎన్డీఏలో చేరేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.