Chandrababu Naidu: ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తిరుమల పేరుగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల కోసం వసతి.. రవాణా.. ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అడుగేసింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుపతి నగర అభివృద్ధి తో పాటు.. తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగుల లేఔట్ లో సదుపాయాల కల్పనకు రంగం సిద్ధం చేసింది. కీలక రహదారుల విస్తరణకు కలిపి మొత్తం 3200 కోట్లతో పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టులు కనుక పూర్తయితే తిరుపతిలో భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడతాయి. నగరంలో రవాణా వ్యవస్థకు ఊరట లభించే అవకాశం ఉంది.
భక్తుల కోసం 2,750 కోట్లతో..
తిరుమల కొనిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. రోజుకు 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పార్కింగ్.. రవాణా సదుపాయాల మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ క్రమంలోనే అలిపిరి సమీపంలో ఉన్న ఎస్వి జూ పార్క్ వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో 2,750 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రీం టౌన్షిప్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒకేసారి 26,000 మంది భక్తులకు వసతి కల్పించబోతున్నారు. ఇందులో జి ప్లస్ నైన్ అంతస్తులతో నాలుగు బ్లాకులు నిర్మిస్తారు. పదివేల మందికి వసతి కల్పిస్తారు. జి ప్లస్ ఫోర్ అంతస్థలతో మరో నాలుగు పిలిగ్రీమ్ ఎనిమిటి కాంప్లెక్స్లను నిర్మించి.. 16,000 మందికి వసతి కల్పిస్తారు.
సొంత వాహనాల్లో వచ్చే వారికి
సొంత వాహనాలలో తిరుపతికి వచ్చే వారికి జి ప్లస్ ఫైవ్ అంతస్తుల లో మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఏకంగా 4500 వాహనాలు నిలిపే అవకాశం ఉంటుంది. భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు జి ప్లస్ త్రీ అంతస్తులలో సెంట్రలైజ్డ్ వంటశాలను నిర్మించబోతున్నారు. ఒకేసారి 6000 మందికి భోజనం అందించేలా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి వెళ్లే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి జి ప్లస్ 2 విధానంలో 30 బస్సు బే లను ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీవారి వైభవం.. తిరుమల ఆధ్యాత్మిక ప్రాశస్యాన్ని తెలియజేయడానికి డిజిటల్ మ్యూజియం.. థియేటర్.. గ్యాలరీలను ఇందులో ఏర్పాటు చేయబోతున్నారు.
టిటిడి ఉద్యోగుల కోసం
టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కోసం కేటాయించిన స్థలాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. తిరుపతి జిల్లాలోని వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద 432 ఎకరాల పరిధిలో 5,192 మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే ఆస్థానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ రహదారులు.. డ్రైనేజీ.. తాగునీరు వంటి సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 230 కోట్లతో లేఅవుట్లో మౌలిక వసతులు చేపట్టబోతున్నారు. ఇందులో బీటి రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ.. వర్షపు నీటి కాల్వలు.. తాగునీటి పైప్ లైన్లు.. భూగర్భ మురుగునీటి వ్యవస్థ.. విద్యుత్ లైన్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే స్థలాలు పొందిన ఉద్యోగులు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
250 కోట్లతో మాస్టర్ ప్లాన్
తిరుపతి నగరంలో వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. రహదారుల విస్తరణ పై కూడా దృష్టి పెట్టారు. తిరుచానూరు ఆలయానికి వెళ్లే మార్గాలతో పాటు నగరంలోని కీలక రహదారులను అభివృద్ధి చేయాలని తుడా ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు 250 కోట్ల ఖర్చుతో చేపట్టబోతున్న మాస్టర్ ప్లాన్ రహదారుల పనులు నగరంలో రాకపోకలను మరింత మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. తిరుపతిలో వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రహదారుల సామర్థ్యాన్ని పెంచడం.. కీలక మార్గాలలో ట్రాఫిక్ ఒత్తిడిని పూర్తిగా తగ్గించడం.. ఆలయాకు భక్తులు త్వరగా చేరుకోవడానికి మార్గాన్ని సులభతరం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
అభివృద్ధికి కొత్త దిశ
భక్తుల వసతి కోసం 2750 కోట్ల టౌన్షిప్.. టిటిడి ఉద్యోగుల లే అవుట్ కోసం 230 కోట్ల మౌలిక వసతుల పనులు.. మాస్టర్ ప్లాన్ రహదారులకు 250 కోట్లు.. ఇలా మూడు కార్యక్రమాలు తిరుపతి అభివృద్ధికి దోహదం చేయబోతున్నాయి.