Amaravati Re Launch: ఆంధ్రప్రదేశ్ కు ( Andhra Pradesh) ఒక నవ శకం ప్రారంభం కానుంది. మరికొద్ది సేపట్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ చేయనున్నారు. వెలగపూడి లో అమరావతి పునః ప్రారంభం పేరుతో భారీ వేడుకలకు రంగం సిద్ధం అయ్యింది. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా మరో మహోన్నత ఘట్టం. ఐదు కోట్ల ఆంధ్రుల కల మరికొద్ది సేపట్లో సహకారం కానుంది. ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది.
Also Read: చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్.. వైరల్ వీడియో
* సర్వం సిద్ధం..
ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నవ శకం. అమరావతిలో( Amaravathi ) జరిగే కార్యక్రమానికి వెలగపూడిలో 276 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజల కోసం 35 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. భారీ బారికేడ్లు సైతం అక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో వేదిక కనిపించేలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లు వేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు పెట్టారు. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్యాలరీలో తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు.
* భారీ భద్రతా చర్యలు..
ఉగ్ర దాడుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో( Central forces ) పాటు రాష్ట్ర పోలీస్ శాఖ సైతం భారీగా భద్రతా చర్యలు చేపట్టింది. భద్రత కోసం 6500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. వారికి సహాయకులుగా ట్రైనీ ఐపీఎస్ లను కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం 256 ఎకరాలు కేటాయించారు. ప్రముఖుల వాహనాల ను నిలిపేందుకు వేదిక పక్కనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు సభా ప్రాంగణానికి రాలేక పోతే వారు హోల్డింగ్ ఏరియాలో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ వారి కోసం భోజనం, తాగునీటి సదుపాయం కల్పిస్తారు. కరకట్ట మార్గంతో పాటు ఉండవల్లి మీదుగా సచివాలయానికి చేరుకునే రెండు మార్గాలను పూర్తిగా ముఖ్యమైన వ్యక్తుల కోసం కేటాయించారు.
* వేదికపై 19 మంది ప్రముఖులు..
ప్రధాని సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ తో( Prime Minister Narendra Modi) సహా 19 మంది కూర్చుంటారు. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, సిఎస్ విజయానంద్, తదితర ముఖ్యులు ఉంటారు. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. అమరావతి పనుల పునః ప్రారంభానికి గుర్తుగా ఒక ఫైలాన్ ను నిర్మిస్తున్నారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు.
Also Read: నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి అర్ధం అయ్యేది కాదు : పవన్ కళ్యాణ్