Amanchi Brothers: ఏపీ రాజకీయాల్లో ఆమంచి కృష్ణమోహన్ సుపరిచితం. మాజీ సీఎం రోశయ్య ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు కృష్ణమోహన్. అత్యంత దూకుడు కలిగిన నేతగా కూడా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు స్వాములతో కలిసి జనసేనలో చేరతారని సమాచారం. జనసేన ను విస్తరించడానికి పవన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది. 175 అసెంబ్లీ సీట్లు.. 225 స్థానాలుగా మారనున్నాయి. అప్పుడు జనసేన సీట్ల సంఖ్య కూడా పెరగనుంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంచి నేతలను జనసేనలోకి తీసుకునేందుకు పవన్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ సోదరులు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
* 2009లో తొలిసారిగా
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆమంచి కృష్ణమోహన్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు. కానీ 2014లో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. చీరాలలో రికార్డ్ సృష్టించారు.టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. కానీ 2019 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలో చేరిపోయారు ఆమంచి కృష్ణమోహన్. కానీ ఆ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహాత్మకంగా సీనియర్ నేత కరణం బలరాంను రంగంలోకి దించారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. బలరాం టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. కృష్ణ మోహన్ ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పరిస్థితి మారిపోయింది. జగన్ ఆయనను చీరాల నుంచి పర్చూరుకు పంపించారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరాలని భావించారు. అయితే అప్పటికే జనసేనలో చేరిన ఆయన సోదరుడు స్వాములకు టికెట్ లభించలేదు. దీంతో ఆయన జనసేన నుంచి బయటకు వచ్చేసారు. అదే సమయంలో షర్మిల పిలుపుమేరకు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఏకంగా 40 వేల ఓట్లను సొంతం చేసుకున్నారు కృష్ణమోహన్. అందుకే పట్టున్న నేత కావడంతో జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
* సామాజిక కోణంలో
చీరాలలో కాపు సామాజిక వర్గం అధికం. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారు. చంద్రబాబుకు సమాచారం కూడా ఇచ్చారు. పార్టీలో చేరాలని బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే జనసేనలో చేరితే సామాజిక వర్గంగా కలిసి వస్తుందని.. చీరాలలో పట్టు సాధించవచ్చు అని భావిస్తున్నారు ఆమంచి. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.