Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ పరంగా మన టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం అనేది మన పాన్ ఇండియన్ స్టార్ హీరోల ప్రస్తుత టార్గెట్. కానీ అల్లు అర్జున్ ఆ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని మొదటి వారం పూర్తి కాకముందే కొట్టేయబోతున్నాడు. భవిష్యత్తులో మళ్ళీ ఈ స్థాయి వసూళ్లను ఆయన చూస్తాడో లేదో తెలియదు, రెండు సంవత్సరాల తర్వాత విడుదల అవ్వబోయే రాజమౌళి సినిమాకి తప్ప ఎవరికీ సాధ్యం కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు అధిక శాతం బాలీవుడ్ నుండే అవ్వడం కొసమెరుపు. టాలీవుడ్ లో కూడా రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు కానీ, బాలీవుడ్ రేంజ్ లో మాత్రం రావట్లేదని చెప్పొచ్చు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 215 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 216 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి ఈ సినిమాకి అంత లాంగ్ రన్ ఉంటుందా అంటే ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ సినిమాకి నాలుగు రోజులకు కలిపి 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే లాంగ్ రన్ లో 80 కోట్ల రూపాయిల వరకు రాబట్టాలి. ఈరోజు వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమాకి అంతటి లాంగ్ రన్ వస్తుందా లేదా అనేది ఒక అంచనా వస్తుంది. నాలుగు రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి వివరంగా ఈ స్టోరీ లో చూద్దాం.
నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 61 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, తూర్పు గోదావరి జిల్లాలో 7 కోట్ల 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లాలో 10 కోట్ల 20 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కృష్ణా జిల్లాలో 8 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 133 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.