Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగలనుందా? జగన్ ఝలక్ ఇవ్వనున్నారా? సత్తెనపల్లి ఇన్చార్జిగా వేరొకరు రానున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చుతున్నారు జగన్. పార్టీకి గుడ్ బై చెబుతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. సైలెంట్ గా ఉన్న సీనియర్ నేతల స్థానంలో సైతం కొత్తవారిని తీసుకుంటున్నారు. అలాగే వివిధ సమీకరణల్లో భాగంగా ఇప్పుడున్న వారిని పక్కకు తప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో స్పీకర్ గా వ్యవహరించారు తమ్మినేని సీతారాం. ఈ ఎన్నికల్లో ఆమదాలవలస నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడ తమ్మినేని తప్పించి చింతాడ రవికుమార్ అనే యువకుడికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అంబటి విషయంలో సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి మూడోసారి పోటీ చేసిన అంబటి రాంబాబు దారుణంగా ఓడిపోయారు. అయినా సరే బాపట్ల జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు జగన్.కానీ ఇప్పుడు ఏకంగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు సమాచారం.
* రెండుసార్లు ఓటమి
2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తొలిసారిగా పోటీ చేశారు అంబటి రాంబాబు. కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి రావడంతో కోడెల అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. 2019లో మాత్రం అదే కోడెలపై గెలిచారు అంబటి రాంబాబు. జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. గత ఐదేళ్లుగా దూకుడుగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మాజీ మంత్రి తో పాటు బలమైన కాపు సామాజిక వర్గ నాయకుడు. ఆయనపై కొత్త అభ్యర్థిని పెడితే కానీ వైసీపీ గట్టెక్కదని జగన్ భావిస్తున్నారు. అందుకే కొత్త నేత కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
* ఆ సమీకరణలతోనే
సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం అధికం. గతంలో ఇదే నియోజకవర్గానికి రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తే కన్నా లక్ష్మీనారాయణను ఢీ కొట్టవొచ్చని జగన్ భావిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ చాన్స్ ఇవ్వలేదు. అయినా సరే పార్టీ విజయానికి కృషి చేశారు రామకృష్ణారెడ్డి. చురుకైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. పైగా అంబటి పై వైసీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అందుకే సత్తెనపల్లి తెరపైకి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆళ్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.