Triumph Bonneville T40 : ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లోకి మరో మూడు కొత్త బైక్‌లను తీసుకొచ్చింది. బొన్నెవిల్లే కుటుంబానికి చెందిన T40, T40 Black, Bonneville T4 మోడళ్లను దేశీయంగా విడుదల చేసింది. వీటిలో T40, T40 Black ధరను రూ.2,79,999గా, Bonneville T4 ధరను రూ.2,54,999గా నిర్ణయించింది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు.
కొత్త బైక్‌ల కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ అక్టోబర్ 7న సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. T40, T40 Black డెలివరీలు 2026 నవంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుండగా.. Bonneville T4 డెలివరీలు 2027 జనవరి రెండో వారం నుంచి మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది.
క్లాసిక్ డిజైన్
T40, T40 Black, T4 మూడు మోడళ్లలోనూ బొన్నెవిల్లే సిరీస్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్‌ను కొనసాగించారు. టియర్‌డ్రాప్ ఆకారంలోని ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్, పొడవైన మడ్‌గార్డులు, పీషూటర్ తరహా ఎగ్జాస్ట్, వైర్-స్పోక్ వీల్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు వంటి అంశాలు బైక్‌లకు రెట్రో లుక్‌ను అందిస్తున్నాయి. కొన్ని కలర్ ఆప్షన్లలో హ్యాండ్ పెయింటెడ్ కోచ్ లైన్స్, రబ్బర్ ట్యాంక్ నీ ప్యాడ్స్, ట్రయంఫ్ మూడు-బార్ ట్యాంక్ బ్యాడ్జ్ కూడా ఉన్నాయి.
T40ను Aegean Blue with Fusion White, Meriden Blue with Tangerine Orange, New England White with Jet Black రంగుల్లో అందిస్తున్నారు. T40 Blackలో Matt Pewter Grey, Matt Phantom Black కలర్ కాంబినేషన్‌తో పాటు బ్లాక్‌డ్-అవుట్ ఇంజిన్, గ్లోస్ బ్లాక్ అల్యూమినియం వీల్స్ ఉన్నాయి. T4 మాత్రం Phantom Black, Carnival Red, Competition Green రంగుల్లో లభిస్తుంది.
350cc ఇంజిన్
మూడు బైక్‌లలోనూ ట్రయంఫ్ కొత్త 350cc TR సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను ఉపయోగించింది. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌కు రివైజ్డ్ సిలిండర్ హెడ్, బొన్నెవిల్లేకు అనుగుణంగా ప్రత్యేక ట్యూనింగ్ చేశారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 28.3bhp పవర్, 31Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్‌ను తక్కువ RPMల వద్ద మెరుగైన టార్క్ అందించేలా ట్యూన్ చేశారు. దీంతో నగర ప్రయాణాలతో పాటు టూరింగ్ సమయంలోనూ స్మూత్, రిలాక్స్‌డ్ రైడింగ్ అనుభూతి లభించేలా ట్రయంఫ్ రూపొందించింది. తక్కువ ఐడిల్ స్పీడ్, ప్రత్యేకమైన ఫైరింగ్ పల్స్, పీషూటర్ ఎగ్జాస్ట్ కారణంగా ఇంజిన్‌కు మరింత ప్రత్యేకమైన శబ్దం, క్యారెక్టర్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
T40లో అధునాతన ఫీచర్లు
T40లో 4-అంగుళాల సర్క్యులర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో Heritage Mode ద్వారా సంప్రదాయ అనలాగ్ మీటర్ తరహా డిస్‌ప్లేను పొందవచ్చు. ట్రయంఫ్ నావిగేషన్ యాప్ ద్వారా ఫుల్-మ్యాప్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాంటాక్ట్స్ యాక్సెస్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. GPX ఫైల్స్ ద్వారా రూట్లను ప్లాన్ చేసి సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
అదనంగా Road, Rain, Eco అనే మూడు రైడింగ్ మోడ్‌లతో పాటు రెండు కాన్ఫిగర్ చేయగల రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. క్రూయిజ్ కంట్రోల్, లీన్-సెన్సిటివ్ Optimised Cornering ABS, Optimised Cornering Traction Control వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు కూడా T40లో అందించారు.
T4లో సింపుల్ ఎలక్ట్రానిక్స్
T4 ధరను తక్కువగా ఉంచేందుకు ఎలక్ట్రానిక్స్‌ను కొంత సరళీకరించారు. ఇందులో TFTకు బదులుగా కలర్ LCD డిస్‌ప్లే ఉంటుంది. ఫుల్-మ్యాప్ నావిగేషన్ స్థానంలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందించారు. ఫోన్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. అయితే T40లో లభించే క్రూయిజ్ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్‌లు, లీన్-సెన్సిటివ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ T4లో ఉండవు.
790mm సీట్ హైట్
చాసిస్ విషయంలో మూడు మోడళ్లూ క్లాసిక్ థీమ్‌ను కొనసాగిస్తున్నాయి. ముందు 18 అంగుళాలు, వెనుక 17 అంగుళాల వైర్-స్పోక్ వీల్స్‌ను అల్యూమినియం రిమ్స్, స్టీల్ స్పోక్స్‌తో అందించారు. సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి.
బైక్ సీట్ హైట్ 790mmగా ఉంది. యాక్సెసరీ లో సీట్‌ను ఉపయోగిస్తే దీనిని 770mmకు తగ్గించుకోవచ్చు. రెడీ-టు-రైడ్ బరువు 195 కిలోలుగా ఉంది. సెంటర్ స్టాండ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. మూడు మోడళ్లలోనూ అప్పర్ ఇంజిన్ ప్రొటెక్షన్ బార్స్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
మొత్తంగా చూస్తే, క్లాసిక్ బొన్నెవిల్లే డిజైన్‌ను ఆధునిక ఫీచర్లు, 350cc ఇంజిన్‌తో కలిపి అందించడమే కొత్త T40 సిరీస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా T40 ప్రీమియం ఫీచర్లను కోరుకునే రైడర్లను ఆకట్టుకునేలా ఉండగా.. తక్కువ ధరలో బొన్నెవిల్లే అనుభూతిని అందించేందుకు T4ను ట్రయంఫ్ తీసుకొచ్చింది.