AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. తరువాత ప్రాదేశికాలకు, చివరిగా పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే పాత విధానంలోనే బ్యాలెట్ పేపర్ తో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొగ్గుచూపింది. అందుకే ఎన్నికలకు సరిపడినన్ని బ్యాలెట్ బాక్సులు సమీకరించే పనిలో పడింది. పొరుగు రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని చూస్తోంది. మున్సిపల్ ఎన్నికల తో పాటు పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే కొనసాగనున్నాయి. ఈ బ్యాలెట్ బాక్సుల సమీకరణకు గాను సన్నాహాలు మొదలుపెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల కమిషన్ లకు లేఖ రాసింది.
* మున్సిపల్ ఎన్నికలు సైతం..
రాష్ట్రవ్యాప్తంగా 110 మున్సిపాలిటీలతోపాటు 12 వరకు మున్సిపల్ కార్పొరేషన్ లు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. 15000 వరకు పంచాయతీలు సైతం ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపు 1.10 లక్షల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. అందులో ఎక్కువ శాతం వినియోగానికి పనికిరావు అని అధికారుల అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాటిలో 50వేల లోపు మాత్రమే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ అవసరాలకు వినియోగించుకునే వీలుంది. వరుసగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కనీసం 1.50 లక్షల బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తోంది.
* పక్క రాష్ట్రాల నుంచి..
ఆ మూడు రాష్ట్రాల నుంచి కనీసం లక్షకు తక్కువ కాకుండా బ్యాలెట్ బాక్సులు సమీకరించాలన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన. జిల్లాల వారీగా ప్రస్తుతం వినియోగానికి పనికివచ్చే బ్యాలెట్ బాక్సుల వివరాలు పంపాలని కలెక్టర్లకు లేఖ రాసినట్లు సమాచారం. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న ఆలోచనతోనే పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారుల సైతం బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే పేపరు కొనుగోలుకు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.
* రూ.400 కోట్లు ఖర్చు..
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేసింది. నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా ఉండే సమయంలో ఈవీఎంల నిర్వహణకు సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టారు. పంచాయితీ రాజ్ మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్లో 400 కోట్ల రూపాయలకు పైగా ఈవీఎంల కొనుగోలుకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇది ప్రభుత్వంపై భారం పడడంతో.. పాత బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పంచాయితీరాజ్ తో పాటు మున్సిపల్ శాఖలకు ఈ మేరకు మౌఖికమైన ఆదేశాలు కూడా వచ్చినట్లు సమాచారం.