Mexico Earthquake: మెక్సికో–గ్వాటెమాల పసిఫిక్ తీరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో ఈ భూకంపం çమెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాలు వణికిపోయాయి. అమెరికా జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి వైపు సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భూమి లోపలి 15 కిలోమీటర్ల లోతులో జరిగింది. తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య అనేక ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదు కాలేదు.
సునామీ హెచ్చరికలతో అలర్ట్..
భూకంపం సముద్రంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ, మెక్సికో అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికో నేవీ తీర ప్రాంతాల్లోని ప్రజలను బీచ్‌లకు వెళ్లవద్దని, సుమారు ఆరు గంటలపాటు దూరంగా ఉండాలని సూచించింది. అధికారులు తీరాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే పెద్ద సునామీ ఏర్పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ప్రజల్లో భయం..
చియాపాస్‌లోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రమైంది. ఒక ఆసుపత్రి సిబ్బంది అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ, మొదట సాధారణ ప్రకంపన అనుకున్నామని, కానీ తీవ్రత పెరగగా అందరూ భవనం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో రద్దీ రోడ్లపై ప్రజలు భయంతో పరుగులు తీశారు. పలు భవనాలు ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. ఒక హైతీ వలస మహిళ భయంతో అపార్ట్‌మెంట్ నుంచి నాలుగు మీటర్ల ఎత్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. మరొకరికి దుకాణం అద్దం పగిలి చిన్న గాయాలయ్యాయి.
స్పందించిన అధ్యక్షురాలు..
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో పెద్ద నష్టం లేదని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినా, హెచ్చరిక వ్యవస్థ పని చేయలేదు. ఎందుకంటే భూకంప శక్తి నిర్ణీత స్థాయిని దాటలేదు.
గ్వాటెమాలలో సహాయ చర్యలు
గ్వాటెమాల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా శాన్ మార్కోస్, క్వెట్జాల్టెనాంగో వంటి ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. రెడ్ క్రాస్ అత్యవసర బృందాలు నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మెక్సికో, గ్వాటెమాల ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైనవి. 2017లో మెక్సికోలో 7.1 తీవ్రత భూకంపం వల్ల వందలాది ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పటి ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్‌షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
