Deeksha Divas: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సులభంగా వచ్చిందేమీ కాదు. ఎన్నో ఉద్యమాలు, మరెందరో ఆత్మబలిదానలు, మేధావుల ఆలోచనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, విధుల బహిష్కరణలు, సాగరహారాలు, మానవహారాలు వంటి ఎన్నో పోరాటాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రెండు దశల్లో జరిగిందని చెప్పవచ్చు. తొలిదశ, మలిదశ. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎవరు అవునన్నా.. కాదన్న కేసీఆర్ వచ్చాక మారిపోయింది. ఉద్యమం చేసే తీరులో మార్పు కనిపించింది. కేసీఆర్ నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షనే నేడు మనం దీక్షా దివాస్‌గా జరుపుకుంటున్నాం.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో..
తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ ప్రవేశించాక ఉద్యమ స్వరూపంలో మార్పులు కనిపించాయి. ప్రస్తుతం రాజకీయంగా ఆయనపై ఎన్ని విమర్శలు చేసినా.. ఈ విషయంలో మాత్రం చాలా మంది నాయకులు కేసీఆర్‌ను మెచ్చుకుంటారు. తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అన్ని వర్గాలను ఏకం చేసి ముందుండి పోరాడిన గొప్ప నాయకుడు. సమాజంలోని మేధావి వర్గాన్ని ఏకం చేసి వారి సూచనల ప్రకారం ఉద్యమాన్ని నడిపించాడు. అందులో భాగంగానే నవంబర్ 29న సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి జరగాలని చెప్పాడు.
29 నవంబర్ 2009 రోజున సీఎం కేసీఆర్ సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా స్థలిలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే దాని కోసం అదే రోజు ఉదయం కరీంనగర్‌లో ఉన్న ఉత్తర తెలంగాణ భవనం నుంచి బయలుదేరారు. ఈ ఉద్యమాన్ని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైన అణగదొక్కాలని చూసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసీఆర్ ను పోలీసులు అడ్డగించారు. కారులో నుంచి కిందకి దించారు. దీంతో కేసీఆర్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు కలుగజేసుకొని ఆయనను ఖమ్మం జైలుకు తరలించారు.

జైలులోనూ కొనసాగిన దీక్ష
పోలీసులు కేసీఆర్‌ను జైలులో పెట్టినప్పటికీ..అక్కడ కూడా తన దీక్షను కొనసాగించారు. జైలులో అన్నపానీయాలు ముట్టకుండా దీక్షచేపట్టారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. డిసెంబర్ ఒకటవ తేదీన ఆయన ఒక ప్రకటన చేశారు. నేను లేకున్నా ఉద్యమాన్ని కొనసాగించాలని, ఆపవద్దని సూచించారు. డిసెంబర్ 4వ తేదీన ఆయన మరో ప్రకటన చేశాడు. తెలంగాణ వస్తే జైత్ర యాత్ర, లేకపోతే తన శవ యాత్ర అని చెప్పారు. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించాలని ఎంతో మంది కోరారు. కానీ ఎవరు చెప్పినా ఆయన మాత్రం దీక్షను విరమించలేదు. మరో పక్క రాష్ట్రంలో ఆందోళనలు పెరిగిపోయాయి. కేసీఆర్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిపోవడంతో ఆయనను బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరళించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య సమక్షంలో డిసెంబర్ 7వ తేదీన జరిగిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. దీంతో డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ సూచన మేరకు అప్పటి కేంద్ర హోం మంత్రి చిందబంరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు.

తరువాత జరిగిన పరిస్థితుల వల్ల ఆ మాటను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. మళ్లీ అనేక ఉద్యమాల తరువాత 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్రలో మాత్రం నవంబర్ 29వ తేదీన సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఇది ఎప్పటికీ గొప్పగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో నిలిచిపోతుంది.
Also Read: కేంద్రంతో అమీతుమీకే కేసీఆర్ సిద్ధం?