Japan: హెలికాప్టర్లు క్రాష్‌.. ఒకరు మృతి, ఏడుగురి గల్లంతు..

జపాన్‌ రక్షణ మంత్రి మినోరు కిహారా తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రంలో విమాన భాగాలుగా భావిస్తున్న వాటిని రక్షణ బృందాలు గుర్తించినట్లు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : April 21, 2024 2:11 pm

Japan

Follow us on

Japan: రోడ్డు ప్రమాదాల తరహాలోనే గాలిలోనూ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. విమానాలు, హెలిక్యాప్టర్లు సాంకేతిక సమస్యలతో కుప్పకూలుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన రెండు సైనిక విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. సముద్రంలో కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనను సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. గల్లంతయిన వారిలో ఒకరిని రక్షించగా, అతను చనిపోయినట్లు తెలిపారు.

ఎలా జరిగింది?
జపాన్‌ రక్షణ మంత్రి మినోరు కిహారా తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రంలో విమాన భాగాలుగా భావిస్తున్న వాటిని రక్షణ బృందాలు గుర్తించినట్లు తెలిపారు. రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొని సముద్రంలో కూలిపోయినట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణం తెలియదని, మొదట బాధితుల ప్రాణాలను కాపాడటానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ప్రమాదం ఇలా…
జపనీస్‌ నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్ హెచ్ కే వేదించినదాని ప్రకారం.. పసిఫిక్‌ మహాసముద్రంలోని సీకే దీవులలో ఈ సంఘటన జరిగింది. జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు ఈ హెలిక్యాప్టర్లు రాత్రిపూట డ్రిల్‌ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. తోరిషిమా ద్వీపం నుంచి రాత్రి 10:38 గంటలకు (1338 జీఎంటీ) ఒక హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్‌ పోయింది. తర్వాత, రాత్రి 11:04 గంటల ప్రాంతంలో రెండో హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్‌ కట్‌ అయింది. ప్రమాదానికి గురైన మిత్సుబిషి ఏ–60కె హెలికాప్టర్లను నావికా విధ్వంసక నౌకల నుంచి మారిటైమ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ఫోర్స్‌ నిర్వహిస్తోంది. సమీపంలోని జలాల్లో ఇతర విమానాలు లేదా నౌకలు లేవని, మరో దేశం ప్రమేయం ఉండే అవకాశం లేదని మారిటైమ్‌ సెల్ఫ్‌–డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది.