NHAI : మనం వెళ్తున్న దారి సరిగ్గా ఉంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. దారిలో గుంతలు ఉన్నా.. గోతులు ఉన్నా ప్రయాణం విషాదం అవుతుంది. అందుకే దారులు బాగుండాలి.. ప్రయాణం సాఫీగా సాగాలని ప్రతీ ప్రయాణికుడు కోరుకుంటాడు. ఆధునిక ప్రపంచంలో రోడ్లు బాగుంటేనే ఆ దేశం అభివృద్ధి పథంలో సాగుతుంది. లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. అంతిమంగా ప్రభుత్వాధినేతలు అధికారాన్ని కోల్పోతారు.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నంగా వెలుగొందుతున్న దేశాలు ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం అక్కడి రోడ్లే. రోడ్ల వల్లనే రవాణా బాగుంటుంది. రవాణా ద్వారానే ఆదాయం దండిగా వస్తూ ఉంటుంది. ఆదాయం అధికంగా ఉంటే ఎలాంటి పనులు చేపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మన దేశంలో రోడ్ల నిర్మాణం గడచిన కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం లాగా సాగుతోంది. ఇది అభినందించాల్సిన విషయం. పైగా దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. నిర్మాణంలో చూపిస్తున్న శ్రద్ధను మరమ్మతుల విషయంలో చూపించడం లేదు. అందువల్ల ఆ మార్గాల మీదుగా ప్రయాణం సాగించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు మనదేశంలో రోడ్ల నిర్మాణాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ అనే విధానంలో చేపడుతున్నారు. రోడ్ల కోసం పెట్టిన పెట్టుబడిని టోల్ ప్లాజాలో రుసుము స్వీకరించడం ద్వారా పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ రోడ్ల మరమ్మతుల విషయంలో సంబంధిత ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో గుంతలు పడిన రోడ్లమీదనే ప్రయాణం సాగించాల్సిన దుస్థితి ప్రయాణికులకు ఏర్పడుతోంది. ఇటువంటి గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేయడం ఇష్టం లేక ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. అతడు చేపట్టిన నిరసన అధికారులను కదిలించింది. ప్రభుత్వాన్ని తల వంచేలా చేసింది.
కేరళ రాష్ట్రానికి చెందిన షెంటో వి. ఆంటో అనే వ్యక్తి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. ఇతడు ఇటీవల పాలక్కాడ్ జిల్లాలోని పన్నియంకర టోల్ ప్లాజా లో టోల్ ఫీజు చెల్లించడానికి నిరాకరించాడు. పైగా అతడు తన ఫాస్టాగ్ ను రీఛార్జ్ చేసుకోలేదు. తను ప్రయాణిస్తున్న రోడ్డు అత్యంత దారుణంగా ఉందని.. గుంతల మయంగా ఉందని.. అటువంటి రోడ్డుమీద ఎలా ప్రయాణించాలని అతడు నిరసన వ్యక్తం చేశాడు. దాదాపు టోల్ ప్లాజా ఎదుట తొమ్మిదిన్నర గంటలు నిరసన వ్యక్తం చేశాడు. షెంటో వి. ఆంటో తరచుగా పాలక్కాడ్ నుంచి ఎర్నాకులం, త్రిసూర్ వెళ్తుంటాడు. అతడు వెళ్తున్న రోడ్డు అత్యంత దయనీయంగా ఉంది. కొన్నిచోట్ల రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి స్థితిలో కూడా టోల్ ఫీజ్ వసూలు చేయడాన్ని అతడు తీవ్రంగా తప్పుపట్టాడు . పైగా అతడి సోదరి గర్భవతిగా ఉంది. ఇటువంటి రోడ్డుమీద ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడం ఇష్టం లేక.. వేరే ప్రాంతం మీదుగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఫలితంగా వారు అధికంగా దూరాభారాన్ని చవిచూడాల్సి వచ్చింది.
“సురక్షితమైన, సౌకర్యవంతమైన రోడ్లు నిర్మించని పక్షంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎట్టి పరిస్థితుల్లో టోల్ వసూలు చేయకూడదని” ఇటీవల కేరళ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.. అయినప్పటికీ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థలు ప్రయాణికుల నుంచి టోల్ వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని షెంటో వి. ఆంటో ప్రముఖంగా ప్రస్తావించారు. తను ఎట్టి పరిస్థితుల్లో టోల్ ఫీజు చెల్లించలేనని.. ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించబోనని స్పష్టం చేశారు. గంటల తరబడి అతడు నిరసన వ్యక్తం చేసిన తర్వాత టోల్ ప్లాజా లో ఉన్న సిబ్బంది అతడిని రాకపోకలకు అనుమతించారు..షెంటో వి. ఆంటో చేపట్టిన నిరసన సరికొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. మరి ఇతడి నిరసనతోనైనా దేశంలో రోడ్లు బాగుపడతాయా? జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జ్ఞానోదయం అవుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.