IndoSol company land: ఇండో సోల్ సోలార్ కంపెనీతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందా? అందుకే ఆ కంపెనీకి పెద్ద ఎత్తున భూములు కేటాయించిందా? దీనిపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఎగసిపడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్వపు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఉలవపాడు, కరేడు రైతులు పోరాట బాట పట్టారు. తమ భూములను కాపాడుకోవడానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చావనైనా చస్తాం కానీ.. ఆ కంపెనీకి భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ ఆరోపించినవారు.. ఇప్పుడు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. ఇండో సోల్ సోలార్ కంపెనీ యాజమాన్యంతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. దీంతో ఇది సంచలన అంశంగా మారింది.
Also Read: ఏపీలో ఈవీఎంలు దాచిన నిజం.. సంచలనం..
భారీ పెట్టుబడులతో..
ఇండో సోల్ కంపెనీ అనేది ఏపీలో గత కొద్దిరోజులుగా భారీగా పెట్టుబడులు పెడుతోంది. షిరిడీసాయి ఎలక్ట్రానిక్స్ పేరిట ఈ సోలార్ కంపెనీ విస్తరణ జరుగుతోంది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఇండో సోల్ సోలార్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం అయింది. అయితే ఎక్కడికక్కడే స్థానికులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళనలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను వదులుకోమని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇది వైరల్ అవుతుంది. మున్ముందు మరిన్ని వివాదాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసిపి హయాంలో తెరపైకి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇండోసోల్( indosol ) కంపెనీ తెరపైకి వచ్చింది. కడప జిల్లాకు చెందిన విశ్వేశ్వర్ రెడ్డి దీనికి యజమాని. ఓ చిన్న కాంట్రాక్టర్ గా ఉన్న ఆయన.. అనతి కాలంలోనే వేల కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి చేరుకున్నారు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. విశ్వేశ్వర్ రెడ్డి జగన్ కు బినామీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ సోలార్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అదే ప్లాంట్ కు టిడిపి కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం.. భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక కూటమి ప్రభుత్వంలో కొందరి హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పచ్చటి పంట భూములు ఇవ్వబోమని స్థానికులు చెబుతున్నారు.
Also Read: కొత్త రేషన్ కార్డుల పంపిణి ఎప్పుడంటే?
మామిడి పంటకు ప్రసిద్ధి..
ఉలవపాడు( Ulava Padu) అనేది జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతం. ఈ ప్రాంతంలో విస్తారంగా మామిడి పంట పండుతుంది. ఇక్కడ పండే మామిడి పంటకు జాతీయస్థాయిలో సైతం గుర్తింపు ఉంది. అందుకే ఇక్కడ భూములను వదులుకునేందుకు స్థానికులు సిద్ధంగా లేరు. అయితే ఇండో సోల్ కంపెనీతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందన్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.