Hezbollah attacks on Israel : హెజ్ బొల్లా వర్సెస్ ఇజ్రాయిల్.. పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా?

లెబ నాన్ వేదికగా పనిచేస్తున్న హెజ్ బొల్లా సంస్థకు ఇరాన్ దండిగా ఆర్థిక సహాయం చేస్తోంది. సైనిక శిక్షణతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తోంది. సిరియా కూడా తన వంతు సాయం అందిస్తోంది. 2022లో లెబనాన్ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హెజ్ బొల్లా 13 స్థానాలు గెలిచింది. అంతేకాదు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరపున హెజ్ బొల్లా పోరాడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 29, 2024 10:32 pm
Follow us on

Hezbollah attacks on Israel :  రష్యా – ఉక్రెయిన్ యుద్ధం పర్యవసనాలను ప్రపంచం ఇంకా చవి చూస్తూనే ఉంది. యూరప్ దేశాలను గ్యాస్, గోధుమలు, బార్లీ, కాఫీ గింజల కొరత వేధిస్తూనే ఉంది. మరోవైపు రష్యా కూడా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది.. రెవెన్యూ లోటు పూడ్చుకునేందుకు తక్కువ ధరకే ఆసియాలోని భారత్, ఇతర దేశాలకు ఇంధనాన్ని విక్రయిస్తోంది. బొగ్గును కూడా సముద్ర మార్గాల ద్వారా రవాణా చేస్తోంది. అయినప్పటికీ రష్యా ఆర్థిక పరిస్థితి పెద్దగా మారుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ యుద్ధాన్ని మర్చిపోకముందే.. ఇజ్రాయిల్ – పాలస్తీనా పరస్పరం దాడులకు దిగడం.. ఇందులోకి ఇరాన్ వంటి దేశాలు ఎంట్రీ కావడం.. కలకలం రేపుతోంది. తాజాగా లెబనాన్ కు చెందిన హెజ్ బొల్లా ఇజ్రాయిల్ పై రాకెట్లతో వరుస దాడులు చేస్తోంది. హెజ్ బొల్లా ప్రయోగించిన రాకెట్ ఇజ్రాయిల్ లోని గోలన్ హైట్స్ లోని మజ్ధాల్ షమ్స్ లో ఓ ఫుట్ బాల్ మైదానంలో పడింది. ఈ ఘటనలో ఆ మైదానంలో ఆడుకుంటున్న 12 మంది చిన్నారులు దుర్మరణం చెందారు.. ఇది ఇజ్రాయిల్ అగ్రనేత బెంజమిన్ నెతన్యాహు కు కోపం తెప్పించింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. తమ దగ్గర నుంచి కచ్చితంగా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దీంతో ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తప్పదని తెలుస్తోంది.

లెబ నాన్ వేదికగా పనిచేస్తున్న హెజ్ బొల్లా సంస్థకు ఇరాన్ దండిగా ఆర్థిక సహాయం చేస్తోంది. సైనిక శిక్షణతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తోంది. సిరియా కూడా తన వంతు సాయం అందిస్తోంది. 2022లో లెబనాన్ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హెజ్ బొల్లా 13 స్థానాలు గెలిచింది. అంతేకాదు సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరపున హెజ్ బొల్లా పోరాడుతోంది. హెజ్ బొల్లా ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది.. యుద్ధ నైపుణ్యాలు, ఆయుధాల వినియోగంపై ఇరాన్ శిక్షణ ఇవ్వడంతో హెజ్ బొల్లా ఏకంగా ఇజ్రాయిల్ ను సవాల్ చేస్తోంది.

హెజ్ బొల్లా వద్ద అతిపెద్ద వెపన్ ఫ్యాక్టరీ ఉంది. వారి వద్ద సుమారు లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయి. వీటితో పాటు స్వల్పకాలిక లక్ష్యాలను చేదించే క్షిపణులు కూడా హెజ్ బొల్లా వద్ద ఉన్నాయి. సుమారు లక్షల మందికి పైగా శిక్షణ పొందిన వలంటీర్లు హెజ్ బొల్లా కు ప్రధాన బలం. అయితే వీరంతా ఇజ్రాయిల్ నుంచి లెబనాన్ ను కాపాడేందుకే వీరంతా పని చేస్తున్నారని తెలుస్తోంది.

హెజ్ బొల్లా పై ఒకవేళ ఇజ్రాయిల్ దాడి చేస్తే పశ్చిమ ఆసియా మొత్తం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉంది. అయితే అటు ఇజ్రాయిల్, ఇటు హెజ్ బొల్లా ఆ స్థాయిలో యుద్ధం కోరుకోవడం లేదని ఇంటర్నేషనల్ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. పాలస్తీనాలోని గాజానగరంపై దాడులు నిలిపి వేసేంతవరకు ఇజ్రాయిల్ పై తాము రాకెట్లతో విరుచుకుపడుతూనే ఉంటామని హెజ్ బొల్లా సంస్థ చెబుతోంది. మరోవైపు అత్యంత దుర్భేద్యమైన సైనిక శక్తిని కలిగి ఉన్న ఇజ్రాయిల్ హెజ్ బొల్లా నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తోంది. గతంలో ఇజ్రాయిల్ లెబనాన్ పై దాడులు చేసినప్పుడు.. వాటిని నిలువరించేందుకు హెజ్ బొల్లా తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది. ఈ నేపథ్యంలో హమాస్ లతో సంధి కుదుర్చుకునేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ సంధి కుదిరితే లెబనాన్ పై దాడి మొదలు పెడుతుందని అంతర్జాతీయ మీడియా కోడై కోస్తోంది. మొత్తానికి హెజ్ బొల్లా రాకెట్ దాడుల వల్ల ఇజ్రాయిల్ నష్టాన్ని చవిచూస్తోంది. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ రాకెట్ దాడి జరుగుతుందని జంకుతున్నారు.. ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఇజ్రాయిల్ పై హెజ్ బొల్లా దాడులు చేయడం విశేషం.