Donald Trump Attack: బుల్లెట్ వెంట్రుకవాసిలో చెవిని తాకింది గాని.. లేకుంటే ట్రంప్ పరిస్థితి ఏమయ్యేదో..

ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో దుండగుడు తుపాకి ద్వారా ఐదు షాట్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ ముఖం మీదగా చెవిని తగలడంతో.. అతడు ఎడమ చేతితో దానిని పట్టుకున్నాడు. దీంతో సీక్రెట్ ఏజెంట్లు బ్లాక్ సూట్ లు ధరించి అతని వైపు వెళ్లిపోయారు. "దిగిపో.. వెళ్ళి పో" అంటూ ట్రంప్ ను హెచ్చరించారు. భద్రతా దళాలు అరుస్తుండగా ట్రంప్ నేలపై పడుకున్నాడు. ఆ ఘటన నేపథ్యంలో ర్యాలీకి హాజరైన వేలాదిమంది అరుపులతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 14, 2024 2:02 pm

Donald Trump Attack

Follow us on

Donald Trump Attack: శనివారం పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి చెవికి తీవ్రంగా గాయమైంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్రంగా రక్తస్రావమైంది. భద్రతా దళాలు అతడిని ఆసుపత్రికి తరలించాయి.

ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో దుండగుడు తుపాకి ద్వారా ఐదు షాట్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ట్రంప్ ముఖం మీదగా చెవిని తగలడంతో.. అతడు ఎడమ చేతితో దానిని పట్టుకున్నాడు. దీంతో సీక్రెట్ ఏజెంట్లు బ్లాక్ సూట్ లు ధరించి అతని వైపు వెళ్లిపోయారు. “దిగిపో.. వెళ్ళి పో” అంటూ ట్రంప్ ను హెచ్చరించారు. భద్రతా దళాలు అరుస్తుండగా ట్రంప్ నేలపై పడుకున్నాడు. ఆ ఘటన నేపథ్యంలో ర్యాలీకి హాజరైన వేలాదిమంది అరుపులతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. బుల్లెట్ శబ్దాలు విన్న వారంతా ఆ పచ్చిక మైదానంపై అలానే పడుకుని ఉన్నారు. కొంతమంది తమ సెల్ ఫోన్ల తో ఆ ఘటన మొత్తాన్ని చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇంకా కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు

కాల్పుల అనంతరం ట్రంప్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కౌంటర్ అసాల్ట్ టీం సభ్యులు నిందితుడిని కాల్చి చంపారు. సమీపంలో ఉన్న భవనం పై కప్పు నుంచి అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను కూడా అతని వద్ద నుంచి సేకరించారు. “తుపాకీ నుంచి బుల్లెట్ షాట్ల శబ్దం వినిపించినప్పుడు ఏదో తప్పు జరిగిందని నాకు తెలుస్తోంది. ఆ బుల్లెట్ నా చర్మం మీదుగా దూసుకుపోయిందని” ఘటన తర్వాత ట్రంప్ వ్యాఖ్యానించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. బుల్లెట్ దూసుకుపోయిన తర్వాత చెవి పైన గాయం స్పష్టంగా కనిపించింది.రక్తం కూడా ఆ వేదికపై పడింది. కాల్పులు జరిగిన అనంతరం ట్రంప్ తన చేతి పిడికిలిని గట్టిగా బిగించి.. “పోరాటం” అని నినాదాలు చేశాడు. ప్రజలందరినీ చూస్తూ చేతితో గట్టిగా సంకేతాలిచ్చాడు. తుపాకీ కాల్పుల అనంతరం భద్రతా సిబ్బంది ట్రంప్ ను అత్యంత వేగంగా, సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనను ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ బృందం దర్యాప్తు చేస్తోంది. మాజీ అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నంగా అభివర్ణిస్తూ..ఓ కీలక ప్రకటన చేసింది. ట్రంప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ర్యాలీ జరిగిన పెయిర్ గ్రౌండ్ లో జనాలను వారి వారి ప్రాంతాలకు తరలించారు. అక్కడ నెలకొన్న రద్దీ వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చారు.

ఈ ఘటన జరిగిన తర్వాత ట్రంప్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్ట్ చేశారు. “బట్లర్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి . ఆ సమయంలో నా ప్రాణాలు కాపాడేందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ అత్యంత వేగంగా స్పందించింది. వారందరికీ, మిగతా సిబ్బందికి నా ధన్యవాదాలు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొక వ్యక్తి గాయపడ్డాడు. వారికి నా సంతాపం ప్రకటిస్తున్నాను. భద్రతా పరంగా ఎంతో గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడేంటి ఇలా అయింది. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి నాకు ఏమీ తెలియదు. కాల్పుల శబ్దం వినగానే నాకు చాలా భయమేసింది. ఆ బుల్లెట్ దూసుకుపోవడం వల్ల తీవ్రంగా రక్తస్రావం జరిగింది.. ఏం జరిగిందో నేను ముందే ఊహించగలిగాను.. గాడ్ బ్లెస్ అమెరికా” అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు.