Donald Trump Attack: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పులకు సంబంధించిన కేసులో పురోగతి లభించింది. ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి వివరాలను federal bureau investigation వెల్లడించింది.. ఈ ఘటన వల్ల కలకలం నెలకొన్న నేపథ్యంలో.. కేసును విచారించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. వారితో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా కీలక విషయాలను వెల్లడించారు.
పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ కు చెందిన మాథ్యూ క్రూక్స్ ట్రంప్ పై కాల్పులకు పాల్పడ్డాడని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించారు. ఓటింగ్ నివేదికల ప్రకారం అతడి వయసు 20 ఏళ్ళు. రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడిగా అతడు తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈ వ్యక్తి 2021లో 15 డాలర్లను డెమోక్రట్లకు అనుబంధంగా పనిచేసే ప్రోగ్రెసివ్ టర్న్ అవుట్ ప్రాజెక్ట్ కు చారిటీ కింద ఇచ్చాడు. ట్రంప్ పై కాల్పులు జరిపిన అనంతరం క్రూక్స్ పై భద్రతా దళాలు తుపాకులను ఎక్కుపెట్టాయి. ఈ ఘటనలో అతడు కన్నుమూశాడు. ప్రస్తుతం క్రూక్స్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు..
Federal bureau investigation క్రూక్స్ గురించి కీలకమైన వివరాలు వెల్లడించిన తర్వాత.. సామాజిక మాధ్యమాలలో అతడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొంతమంది పోస్ట్ చేశారు. ఇక అమెరికా కేంద్రంగా పనిచేసే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇంకా కొన్ని సుప్రసిద్ధ మీడియా సంస్థలు క్రూక్స్ కాల్పులకు పాల్పడ్డాడని పేర్కొంటూ ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. అతడి ఫోటోలను ముందుగానే టెలికాస్ట్ చేశాయి. ఇక కాల్పులకు ముందు క్రూక్స్ ఒక వీడియో రూపొందించాడు. అది కూడా సామాజిక మాధ్యమాలలో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో ” నేను రిపబ్లికన్ పార్టీని ద్వేషిస్తున్నాను. ట్రంప్ నాయకత్వాన్ని నిరసిస్తున్నాను” అంటూ క్రూక్స్ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ట్రంప్ పాల్గొన్న ఎన్నికల ర్యాలీ వేదికకు 130 గజాల దూరం నుంచి క్రూక్స్ కాల్పులకు తెగబడ్డాడు. ఓ ఫ్యాక్టరీ పైకప్పు నుంచి అతడు మాటు వేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 5 షాట్లు అతడు కాల్చాడు. ఒక బుల్లెట్ ట్రంప్ చెవి మీదుగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆయన చెవికి తీవ్రంగా గాయమైంది. రక్త స్రావం కూడా అధికంగా జరిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని federal bureau investigation అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని.. మరి కొద్ది రోజుల్లో కీలక విషయాలు వెల్లడిస్తామని వారు అంటున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే తమకు వెల్లడించాలని.. ర్యాలీలో ఏవైనా ఆధారాలు లభిస్తే తమకు అందించాలని federal bureau investigation అధికారులు సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే ప్రకటనలు చేశారు.
మరోవైపు ఈ ఘటన తర్వాత సోషల్ మీడియా లో పలువురు అమెరికన్లు పోస్టింగులు చేస్తున్నారు.. అమెరికాలో భద్రతపై అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఒక మాజీ అధ్యక్షుడికి పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేకపోయారు. అతని ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటారా.. స్థానికులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో మిగతా వారి భద్రత పరిస్థితి ఏమిటి? ప్రపంచానికి అమెరికా చెబుతున్న పాఠం ఇదేనా.. అమెరికా నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఇవేనా” అంటూ అమెరికన్ పౌరులు విమర్శిస్తున్నారు.