Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ సాదించారు. 2025, జనవరి 20న 47వ అధ్యక్షుడిగా వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్.. నూతన మంత్రులు, ఇతర అధికారుల నియామకాల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన యుద్ధాలు ఆపడం, అమెరికా అభివృదిధపైనా ఫోకస్ పెట్టారు. బాధ్యతలు చేపట్టగానే ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ఆయన అతిపెద్ద బహిష్కరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో 18 వేల మంది భారతీయులపై బహిష్కరణ వేటు పడుతుందని తెలుస్తోంది.
అక్రమంగా 10.45 లక్షల మంది..
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్‌ఫర్మేషన్ గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యంలో 10.45 లక్షల మంది అక్రమంగా ఉంటున్నారు. ఇందులో 17,940 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత వీరందరినీ వారి దేశౠలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
వారికే చిక్కులు..
సరైన పత్రాలు లేకుండా చట్టపరమైన హోదా పొందడం అమెరికాలో అంత ఈజీ కాదు. ఇలాంటివారే బహిష్కరణకు గురవుతారని తెలుస్తుంది. వీరిని గుర్తించడానికి కూడా ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మూడేళ్లలో 90 వేల మంది భారతీయులు అక్రమంగా అమెరికా వెళ్లారు. వీరంతా పట్టుబడ్డారు. వీరిలో చాలా మంది గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే.
బహిష్కరణకు రంగం సిద్ధం..
అమెరికాలో అతిపెద్ద బహిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. అధికారులు ఈ పనిలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్‌రామస్వామి, ఎలాన్ మస్క్ అక్రమ వలసదారులపై దృష్టి పెట్టారు. ఎన్నికల ఎజెండాలో ఉన్నట్లుగానే వలసదారులను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ కాబోతోందని తెలుస్తోంది.