Kapu Politics in AP: ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గం బలం ఏంటన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారందరికీ తెలుసు. వారు ఎవరికి ‘కాపు’ కాస్తే.. అధికారం వారిదే! అవును.. అన్ని సామాజిక వర్గాలతో పోలిస్తే.. కాపుల ఓట్లే అత్యధికంగా ఉన్నాయక్కడ. దీంతో.. పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి కాపులు చేరారు. అయితే.. బలం, బలగం ఎంతున్నా.. కాపుల నుంచి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే.. రాబోయే రోజుల్లో చరిత్ర తిరగ రాయడం ఖాయమని, ఏపీలో కాపులదే రాజ్యమని అంటున్నారు మాజీ మంత్రి, కాపు సీనియర్ నేతలు. మరి కాపుల రాజ్యాధికారం పక్కనపెడితే.. ఇంతమందిలో అసలు నడిపించే నాయకుడు ఎవరన్నది ప్రశ్న. అనాదిగా కాపు ఉద్యమాన్ని రగిలించి లబ్ధి పొందిన నేతలు ఉన్నారే కానీ.. కాపుల కోసం కృషి చేసి రాజ్యాధికారం సాధించిన వారు లేరు. ఈ క్రమంలోనే ఈసారైనా కాపుల ఐక్యత ఉద్యమంగా మారి వారికి రాజ్యాధికారం ప్రాప్తిస్తుందా అన్నది ప్రశ్న?
విశాఖపట్నంలో దివంగత కాపు నేత వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాజకీయాల్లో ఉన్న కీలక కాపు నేతలు పార్టీ రహితంగా దీనికి హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. త్రిమూర్తులు, గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కాపులదేనని… రాజకీయాలను కాపులే శాసించాలని అన్నారు. అంతేకాకుండా.. కాపులంతా కాపు నేతలకే ఓట్లు వేయాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మూడు పార్టీలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. జగన్… ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచి.. చంద్రబాబు ‘కమ్మ’ సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఇప్పటికే ముద్రపడ్డారు. ఇక, మూడో వైపు పవన్ కల్యాణ్ కాపు నేతగా ఉన్నారు. పవన్ ఎప్పుడూ ఒక సామాజిక వర్గ నేతగా పరిమితమయ్యేలా వ్యవహరించలేదు. అయినప్పటికీ చర్చలు మాత్రం ఆ విధంగా నడుస్తున్నాయి.
తాను ఉన్నట్టుండి సీఎం అయిపోవాలని అనుకోవట్లేదని, ఒక నిర్ధిష్ట ప్రణాళికతో ప్రజలకు నిజమైన సేవ చేసేందుకు వచ్చానని పవన్ చెబుతూ వచ్చారు. అయితే.. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో.. పవన్ మళ్లీ రాజకీయాలు వదిలేసి సినిమాల బాటపడుతారని అందరూ అనుకున్నాయి.. కానీ.. ఎవ్వరూ ఊహించనంత వేగంగా బౌన్స్ బ్యాక్ అయ్యి రాజకీయాల్లోకి ఫైర్ బ్రాండ్ గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ ఓటమిని ఇంత స్పోర్టివ్ గా తీసుకుంటాడని తాను ఊహించలేదని, ఇదేవిధంగా ముందుకు సాగితే ఆయనకు భవిష్యత్ ఖచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారు చెప్పడం ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ అద్భుతం సృష్టిస్తాడా అనే చర్చ అయితే ఏపీలో గట్టిగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు, కరణం, త్రిమూర్తులు వంటి నేతలు.. ఏపీలో కాపులదే భవిష్యత్ అని వ్యాఖ్యలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. గంటా.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రజారాజ్యంలో పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. వైసీపీలో చేరుతారనే చర్చ సాగినా.. అదేం జరగలేదు. ప్రస్తుత వ్యాఖ్యల నేపథ్యంలో జనసేనలో చేరే అవకాశం ఉందా? అనే డిస్కషన్ నడుస్తోంది.
టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు , వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు, కరణం ధర్మశ్రీ, జనసేన బీజేపీలో ఉన్న కాపు నేతలు ఒకచోట చేరి భవిష్యత్ రాజకీయాలపై కామెంట్లు చేయడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలానే అన్ని పార్టీల నేతలు ఒక చోట చేరి కాపుల ఐక్యతను చాటిచెప్పారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా లేనట్టే. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వైసీపీలో చేరేందుకు రెడీ అయినా జగన్ నుంచి స్పందన రాకపోవడంతో గమ్మున ఉన్నాడన్న టాక్ ఉంది. ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంది. టీడీపీలో నమ్మే పరిస్థితి లేదు. అధికార వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. జనసేన లాంటి నిక్కచ్చి పార్టీలో అధికార యావ ఉన్న గంటా ఉండగలడా? అంటే అనుమానమేనంటున్నారు. ప్రస్తుతం గంటా సహా కాపు నేతలకు రాజకీయ శూన్యత ఏర్పడేసరికి ఈ ఐక్యత రాగం ఆలపిస్తున్నారా? అన్న అనుమానాలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలుగుతున్నాయి. వీరిందరూ ఒక తోవలోకి వచ్చి పోరాటం చేయగలరా? అన్నది ప్రధాన డౌటు. కాపులకు రాజ్యాధికార కాంక్ష ఇప్పటిది కాదు. ఆ ఆశ ఉన్నా నాయకత్వ లోపంతో ఎప్పుడూ ఎదగని పరిస్థితి ఉంది.
పవన్ కళ్యాణ్ కాపు సామాజికవర్గం తరుఫున ఉన్నా కూడా ఎప్పుడూ ఆయన కులం కార్డు వాడకపోవడం మైనస్. కాపు నేతలను అక్కున చేర్చుకొని రాజకీయం చేసిన చరిత్ర లేదు. సో ఇప్పుడు కాపు నేతలంతా కలిసి ఇచ్చిన పిలుపు దేనికి అర్థం అని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
తోట త్రిమూర్తులు అసలు ఎవరు కాపులకు మద్దతిస్తే వారికే ఓటేస్తామని ఖరాఖండీగా చెప్పాడు. వాళ్లనే రాజకీయాల్లో గెలిపించండని అన్నాడు. వీళ్లందరూ కాపుల కోసం నిలబడగలరా? మళ్లీ వీరికి పదవులు వస్తే కాపుల తరుఫున నిలబడుతారా? జారిపోతారా? అన్నది ఇప్పుడు కాపుల్లో వ్యక్తమవుతున్న ప్రధాన ప్రశ్న. ఒకవేళ అధికార వైసీపీలో ఉన్న కరణం ధర్మశ్రీ, తోట త్రిమూర్తులు మంత్రి పదవులు ఆశించి ఇలా కాపు ఉద్యమాన్ని రగిలిస్తున్నారా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. వీళ్లందరూ కాపుల ఐక్యత కోసం కృషి చేస్తే అంతకుమించిన మంచి పని మరొకటి లేదు. కానీ ఈ నేతలు తమ పదవుల కోసం ఇలా ఐక్యత రాగం వినిపిస్తే మాత్రం మరోసారి కాపులు ఇలాంటి నేతల చేతుల్లో మోసం పోవడం ఖాయం. కాపు నేతలు, వారి వెంట సామాజికవర్గం నిలబడితే రాజ్యాధికారం వారిదే.. లేదు పదవుల కోసమే ఈ ఎత్తు వేస్తే మాత్రం అభాసుపాలు కావడం తథ్యం.
Also Read: పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించాల్సిన టైం వచ్చిందా?
స్వయంగా కాపు అయిన పవన్ కు భారీగా అభిమానుల బలం ఉన్నప్పటికీ.. ఆయన వెంట బలమైన కాపు నేతలు లేకపోవడం లోటుగానే ఉంది. ఎన్నికల సమయం నాటికి చాలా మంది జనసేన కండువా కప్పునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు జనం కూడా పవన్ టైం పాస్ రాజకీయం చేయడానికి రాలేదని, సీరియస్ గా ఉన్నాడని గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ కాపు నేతలంతా పవన్ వెంట నడుస్తారా? లేక స్వతంత్రంగా నిలబడుతారా? వేరే గూటికి చేరుతారా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది.
అయితే ఈ కాపు నేతలు చేసిన ప్రకటనలు బాగానే ఉన్నా వీరిలో ఎవరు నాయకత్వం చేపడుతారు? నాయకత్వలోపాన్ని అధిగమించే సత్తా ఎవరికుంది? వారి దారిలో మిగతా వారు నడుస్తారా? అన్నది కూడా డౌటుగా ఉంది. నడిపించే కాపు నాయకుడు బలంగా ఉంటేనే ఈ ఉద్యమం రాజ్యాధికారానికి దారితీస్తుంది. లేదంటే రాజ్యాధికారం అందని ద్రాక్ష అవుతుంది.
Also Read: ఇంకా రెండేళ్లే మిగిలింది.. ప్రజలను మెప్పించేందుకు జగన్ ఏం చేయనున్నారు?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Who is the leader of the kapu community
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com