YS Jagan Mohan Reddy : జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కాపులపై ఫోకస్ పెట్టారా? ఆ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలని భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల నాటికి కాపులకు ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ నియామకాలు చూస్తుంటే అలానే ఉంది. తాజాగా ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా మాజీమంత్రి కురసాల కన్నబాబుకు చాన్స్ ఇచ్చారు జగన్. వైసిపికి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం తో పాటు పదవులకు సైతం ఆయన రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. ఇప్పటివరకు అధ్యక్ష పదవిలో కన్నబాబు ఉండేవారు.
* జనసేన వైపు టర్న్
ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం( kapu community) జనసేన వైపు నడిచింది. కూటమికి మద్దతు తెలిపింది. అయితే కాపు సామాజిక వర్గం ఎప్పుడు స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. 2014లో పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు నాడు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది కాపు సామాజిక వర్గం. కానీ ఆ ఐదేళ్లలో కాపులకు ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఆ సామాజిక వర్గంలో మార్పు వచ్చింది. అందుకే 2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసిన అటువైపు చూడలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ సామాజిక వర్గంలో మార్పు కనిపించింది. దాదాపు 90% కాపులు కూటమి వైపు నిలిచారు. అయితే ఎనిమిది నెలలు దాటుతున్న కాపులకు ప్రత్యేకంగా ఎటువంటి ప్రయోజనం లేదు. వారికి సంబంధించిన రిజర్వేషన్లు గానీ.. సంక్షేమ పథకాలు కానీ అమలు చేయలేక పోయింది కూటమి ప్రభుత్వం. అందుకే వారి వ్యవహార శైలిలో మార్పు వస్తోంది. దీనిని గమనించిన జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని మార్చారు. పార్టీ నియామకాల్లో కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
* పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది కాపు నాయకులు వైసీపీకి( YSR Congress ) గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పదవులు చేపట్టిన వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే మెజారిటీ కాపు నాయకులు మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సైతం యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు. అప్పుడప్పుడు ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తున్నారు. మరోవైపు కూటమిలో ఏమాత్రం చీలిక వచ్చినా కాపుల్లో మాత్రం స్పష్టమైన మార్పు రావడం ఖాయం.
* ప్రతి ఎన్నికల్లోను కాపుల నిర్ణయం మార్పు
ప్రతి ఎన్నికల్లోను కాపులు( kapu community) తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. మధ్యలో తెలుగుదేశం పార్టీకి సైతం మద్దతు తెలిపారు. 1988లో వంగవీటి మోహన్ రంగ హత్యతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు. 1989 ఎన్నికల్లో కాపుల ప్రభావంతోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 1994లో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చారు. ఆ పార్టీ గెలిచింది. 2004 ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది కాపు సామాజిక వర్గం. ఇలా కాపులు నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కాపుల విషయంలో మాట తప్పితే మాత్రం వారు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి కాపు నేతలను ముందు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే కొత్తగా ఈ నియామకాలు చేపడుతున్నారు. అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.