KTR- Harish Rao
KTR- Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటించాలని ఎన్నికల సంఘం నిర్ణయిచింది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్తోపాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఈనెల 16 నుంచి ప్రచారం ప్రారంభించబోతోంది. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టక ముందే తెలంగాణ ముఖ్యమైన మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థిన, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే 40 నియోజకవర్గాలను చుట్టొచ్చారు. తమ సొంత నియోజకవర్గాలు అయిన సిరిసిల్ల, సిద్దిపేటతోపాటు ఉమ్మడి జిల్లాల వారీగా విభజన చేసుకుని కృష్ణార్జునుల్లా ఎన్నికల రణరంగంలో అన్నీతామై వ్యవహరిస్తున్నారు. ఈనెల 16 నుంచి కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి కేటీఆర్, హరీశ్‌రావు సొంత నియోజకవర్గాలపై పడింది. 2014, 2018 ఎన్నికల్లో మెజారిటీ కోసం పోటీ పడిన ఈ బావ, బావమర్దులు ఈసారి ఎంత మెజారిటీ సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. వారి గెలుపుపై ఎవరికీ సందేహం లేదు. కానీ, మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఇటు బీఆర్ఎస్తోపాటు, అటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది.
హరీశ్‌రావు మెజారిటీ ఇలా..
తెలంగాణ కన్నా ముందు నుంచే కేటీఆర్, హరీశ్‌రావు ప్రజాప్రతినిదులుగా ఎన్నికయ్యారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. స్వరాష్ట్రంలో వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధితోపాటు, ఎన్నికల్లో మెజారిటీ విషయంలో పోటీ పడుతున్నారు. 2004లో హరీశ్‌రావు తొలిసారిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారే 58 వేల మెజారిటీ సాధించారు. తర్వాత 2009లో 60 వేలు మెజారిటీతో గెలిచారు. ఇక తెలంగాణ సాధించిన తర్వాత మెజారిటీ లెక్కలు మారిపోయాయి. 2014లో 93,328 మెజారిటీ సాధించిన హరీశ్‌రావు 2018 ఎన్నికల్లో 1,20,650 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిని చిత్తు చేశారు. 2023 ఎన్నికల్లో హరీశ్‌రావు మెజారిటీ 1,50,000 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నేనుసైతం అంటున్న కేటీఆర్..
ఇక తెలంగాణ ఉద్యమం చివరి దశలో కేటీఆర్.. నాటి ఉద్యమ సారథి కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి కేకే.మహేందర్‌రెడ్డిపై కేవలం 171 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 68,219 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక తెలంగాణ సాధించిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 92,135 మెజారిటీ సాధించారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో హరీశ్‌రావుతో పోటీ పడి 1,25,213 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈసారి కేటీఆర్ కూడా 1,50,000 మెజారిటీ సాధిస్తారని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేస్తున్నారు.
అభివృద్ధి, బలమైన ప్రత్యర్థి లేకపోవడం..
సిద్దిపేట, సిరిసిల్లలో హరీశ్‌రావు, కేటీఆర్ భారీ మెజారిటీకి రెండు నియోజకవర్గాల్లో ప్రతిపక్షం పూర్తిగా బలహీన పడడమే కారణం. వారిపై పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు. దీంతో గట్టి ప్రత్యర్థి లేకపోవడంతోపాటు, తెలంగాణలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే. దీంతో అభివృద్ధి చేస్తున్న నేతలకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో మెజారిటీ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: What will be the majority of ktr and harish rao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com