TDP MPs: తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తరువాత శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. అయినా అధినేత చంద్రబాబు నిరాశ చెందకుండా పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిని ఎండగడుతున్నారు. తన వయసును కూడా లెక్క చేయకుండా కాలికి బలపం కట్టుకొని మరీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తున్నారు, పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు.అటు మహానాడును కూడా సక్సెస్ చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాల పేరిట ఇప్పుడిప్పుడే నేతలను లైన్ పై తీసుకొస్తున్నారు. వచ్చే ఎన్నిలకు సమయాత్తం చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ.. కొందరు నాయకులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరికొందరు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. మరికొందరైతే స్వపక్షంలో విపక్షం మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అటు అధిష్టానానికి, అధినేతకు తలనొప్పిగా మారుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ కొత్తగా తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. అటువంటి నాయకుల తీరుతో పార్టీ శ్రేణుల్లో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా పార్టీకి ముచ్చటగా ఉన్న ముగ్గురు ఎంపీల తీరు విస్మయం గొల్పుతోంది. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 ఎంపీ సీట్లకుగాను మూడుచోట్ల టీడీపీ గెలుపొందింది. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ లు ఎంపీలుగా గెలుపొందారు. వైసీపీ ప్రభంజనంలో కూడా తట్టుకొని నిలబడ్డారు. పార్టీ ఉనికిని ఢిల్లీలో నిలబెట్టగలిగారు. కానీ ప్రస్తుతం వారిలో ఒకరే యాక్టివ్ గా ఉన్నారు. మరొకరుఇటీవల జరిగిన పరిణామాలతో సైలెంట్ అయ్యారు. మరొకరు మాత్రం రోజరోజుకూ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నారు. తొలి ఏడాది వాయిస్ బాగానే వినిపించిన ముగ్గురు ఎంపీలు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. దీంతో అధినేత కూడా ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
గల్లా జయదేవ్ సైలెంట్..
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేసేవారు. 2014 ఎన్నికల్లోగంటూరు నుంచి తొలిసారిగా పోటీచేసిన జయదేవ్ మంచి మెజార్టీతో గెలుపొందారు. లోక్ సభలో పార్టీ వాణిని విడిపించడంలో ముందుండేవారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ప్రస్తావించి మంచి స్పోక్స్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత పరిణామాలతో మరంత యాక్టివ్ గా పనిచేశారు.
ఒకానొక సందర్భంలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. విభజన హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ఆయన లోక్ సభలో చేసిన ప్రసంగం పెద్ద దుమారమే రేగింది. రెండో సారి గెలిచిన తరువాత సంఖ్యాబలంగా తక్కువగా ఉన్న జయదేవ్, రామ్మోహన్ నాయుడులు వాగ్ధాటితో రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే గల్లా జయదేవ్ బ్యాటరీ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వ దాడులు, కోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన తరువాత జయదేవ్ సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడాన్ని సైతం తగ్గించేశారు.పైగా వచ్చే ఎన్నికల్లో తాను గంటూరు నుంచి పోటీచేయనని.. తన తల్లి ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తానని సన్నిహితులు వద్ద తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు యాక్టివ్ గా కనిపించే జయదేవ్ ఒక్కసారిగా సైలెంట్ కావడంతో పార్టీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నాయి.
కేశినేని నాని చుట్టూ…
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. గత కొద్దిరోజులుగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని చర్యలతో చంద్రబాబు విసిగి వేశారిపోతున్నారు. రెండో సారి గెలిచిన తరువాత ఆయన ఏ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండడం చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. లోకల్ పార్టీ నాయకులతో పాటు అధినేతపై సైతం అంతర్గత సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని గెలిపించడం చంద్రబాబు వల్ల కాదంటున్నారు. 40 అసెంబ్లీ సీట్ల వరకూ రావడం డౌటేనని నాని వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా నాని కుమార్తె శ్రావ్యను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. కానీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు. అయితే టీడీపీలోని గ్రూపు రాజకీయాల వల్లే విజయవాడ కార్పొరేషన్ చేజారిపోయిందని.. తన కుమార్తె మేయర్ కాకుండా పోయారని నాని తెగ బాధపడ్డారు. అసమ్మతి నాయకులకు టీడీపీ అధిష్టానమే మద్దతు పలుకుతుందంటూ అప్పటి నుంచి నాని కీనుక వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా పార్టీతో పాటు అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరింత దూరమవుతున్నారు. మరోవైపు నాని బీజేపీలో చేరుతారన్న టాక్ నడుస్తోంది. ఈ చర్యలతో చంద్రబాబు నానికి ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిన్నిని తెరపైకి తెచ్చినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఒకే ఒక్కడు రామ్మోహన్ నాయుడు
ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా ఇద్దరు ఎంపీలతో పోల్చుకుంటే రామ్మోహన్ నాయుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. యువ నాయకుడిగా దూసుకుపోతున్నారు. మంచి వాగ్దాటి ఉన్న రామ్మోహన్ నాయుడు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక రైల్వేజోన్, విభజన హామీలు, రాష్ట్ర సమస్యలను లోక్ సభలో లేవనెత్తుతున్నారు. యువ పార్లమెంటీరియన్ గా కూడా గుర్తింపు పొందారు. మొత్తానికైతే రామ్మోహన్ నాయుడు తప్పించి మిగతా ఇద్దరు ఎంపీలు పార్టీకి పనికి రాకుండా పోయారన్న వ్యధ అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అటు చంద్రబాబుకు కూడా ఎంపీల వ్యవహార శైలి మింగుడు పడడం లేదు. వచ్చే ఎన్నికల్లో వీరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని వినికిడి.
Also Read:BJP- TDP: టీడీపీకి బీజేపీ స్నేహ హస్తం.. కేసీఆర్, జగన్ చర్యలే కారణం?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What are the reasons for the dissatisfaction of tdp mps
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com