అమెరికా ఎన్నికలు సంవత్సరం ముందే మొదలవుతాయి. ముందుగా రెండు పార్టీల అభ్యర్ధుల ఎంపికతో (వాటినే ఇక్కడ ‘ప్రైమరీలు’ అంటారు) కోలాహలం మొదలవుతుంది. చివరి అంకంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్ధుల మధ్య మూడు ప్రత్యక్ష ముఖాముఖీ డిబేట్లు జరుగుతాయి. ఉపాధ్యక్ష అభ్యర్ధుల మధ్య ఒక డిబేట్ జరుగుతుంది. ఇవి ఈవారం మంగళవారం రాత్రితో (భారత్ లో బుధవారం ఉదయం 6.30 గంటలకు) మొదలవుతాయి. ఈ డిబేట్ ఒక్కోటి 90 నిముషాలు వుంటుంది. ఈ మూడు డిబేట్లు అమెరికా ఓటర్ల పై చాలా ప్రభావాన్ని చూపుతాయి. అమెరికా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాల్లో అధ్యక్ష అభ్యర్ధుల డిబేట్లు ముఖ్యమైనవి. ఇంతకుముందు వ్యాసంలో వివరించినట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి నియామకం కూడా ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి. ఇప్పటికే ఈ నియామకం అంశం ప్రజల్లో నానుతుంది. ఇక ఈ డిబేట్ పై ఇప్పటికే మీడియాలో చర్చలు, విశ్లేషణలు కొనసాగుతున్నాయి. డిబేట్ అయిపోగానే ఒపీనియన్ పోల్ ఫలితాలు వస్తాయి. అందుకే ఈ డిబేట్ పై ఉత్కంట గా ఎదురుచూస్తున్నారు.
అమెరికా ఎన్నికల విధానం పై మరింత విశ్లేషణ
అమెరికా ఎన్నికల్లో ఇంతకుముందే చెప్పుకున్నట్లు అధ్యక్ష ఎన్నికలతో పాటు, ప్రతినిధుల సభకు, మూడింట ఒకవంతు సెనేట్ కు కూడా ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరగబోతున్నాయి. కాకపోతే ప్రపంచం మొత్తం అధ్యక్ష ఎన్నికపై మాత్రమే ఆసక్తి కనబరుస్తుంది. ఇంతకీ ఈ ఎన్నిక ఎలా జరుగుతుందో ఒకసారి స్థూలంగా పరిశీలిద్దాం.
అమెరికా మొత్తం 50 రాష్ట్రాల ప్రజలు ఇందులో పాల్గొంటారు. అమెరికా అధీనంలో వున్న మిగతా ప్రాంతాల ప్రజలు ( వీటిని టెర్రిటరీలు అంటారు) ఇందులో పాల్గొనరు. అధ్యక్ష ఎన్నికకు ఒక ఓటు , వారి ఏరియా లోని ప్రతినిధికి ఒక ఓటు , ఎక్కడయితే సెనేట్ ఎన్నిక జరుగుతుందో ఆ రాష్ట్రాల్లో మరో ఓటు వేస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్ర అన్ని ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు కేటాయిస్తారు. ఈ పద్ధతి 48 రాష్ట్రాల్లో అమలవుతుంది. ఒక్క రెండు రాష్ట్రాల్లో మాత్రం జిల్లా వారిగా ఎన్నుకుంటారు. కారణమేమంటే ఎన్నికల పద్ధతి కూడా రాష్ట్రాల ఇష్టమే. మొత్తం 538 ఎలెక్టోరల్ కాలేజిలో 270 ఎవరికి వస్తే వాళ్ళే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. కాబట్టి దేశవ్యాప్తంగా పాపులర్ ఓటు వచ్చిన అధ్యక్షుడు ఎన్నికవుతాడనే గ్యారంటీ లేదు. దీనిపై కూడా చర్చ నడుస్తుంది. ఈ పద్దతి ఎప్పట్నుంచో వుంది. అమెరికా 13 బ్రిటిష్ కాలనీలు కలిసి స్వతంత్రం ప్రకటించుకున్నప్పట్నుంచి ఫెడరల్ స్ఫూర్తి తోనే పనిచేస్తుంది. రాష్ట్రాల అధికారాల్లో గండి పడితే ఒప్పుకోరు. అందుకే సెనేట్ లో పెద్ద రాష్ట్రమైనా , చిన్న రాష్టమైనా అందరికీ సమానంగా రెండే సీట్లు వుంటాయి. అలాగే అధ్యక్ష ఎన్నికల్లోనూ రాష్ట్రాల మాట చెల్లుబాటు కావటం కోసమే ఈ ఎలెక్టోరల్ కాలేజీ విధానం అమలులో వుంది.
అసలు ఈ ఎలెక్టోరల్ కాలేజీ వ్యవస్థ ఎలా వుంటుంది? 100మంది సెనేట్ సభ్యులు, 435 మంది రాష్ట్రాల ప్రతినిధులు, ముగ్గురు వాషింగ్టన్ రాజధాని ప్రాంత సభ్యులు మొత్తం 538 మంది వుంటారు. సెనేట్ సభ్యులు ఇద్దరుపోనూ మిగతా 435 మందిని చివరిసారి జనాభా లెక్కల్ని బట్టి రాష్ట్రాల వారిగా విభజిస్తారు. దీనిప్రకారం ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రం అత్యధికంగా 55 ఎలెక్టోరల్ సభ్యుల్ని కలిగివుంది. ఆ తర్వాత టెక్సాస్ 38 మందిని, న్యూ యార్క్ , ఫ్లోరిడా చెరి 29 మందిని, ఇల్లినాయ్, పెన్సిల్వేనియా చెరి 20 మందిని కలిగి వున్నాయి. ఈ ఆరు ఎక్కువ ఎలెక్టోరల్ కాలేజీ కలిగిన రాష్ట్రాలు. ఇలా అన్ని రాష్ట్రాలకు ముందుగానే ఈ సంఖ్య కేటాయింపబడుతుంది. ఇలా ఎన్నికైన ఎలెక్టోరల్ కాలేజీ మొత్తం డిసెంబర్ లో రాజధానిలో కూర్చొని అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. కాకపోతే నవంబర్ 3వ తేదీ ఎన్నిక తర్వాత ఎవరికి ఎన్ని ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయో తెలుస్తాయి కాబట్టి ఫలితం అప్పుడే తెలుస్తుంది.
ఎన్నికల సరళి ఎలావుండబోతుంది?
ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి మెజారిటీ వస్తుందనే దానిపై ఒపీనియన్ పోల్స్ వెలువడ్డాయి. అమెరికాలో ఒపీనియన్ పోల్స్ మనతో పోలిస్తే విశ్వసనీయత ఎక్కువగానే వుంటుంది. ఈ అభిప్రాయం ప్రకారం దాదాపు 40కి పైగా రాష్ట్రాల్లో ఎవరివైపు ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయో తెలిసిపోయింది. షుమారు 7,8 రాష్ట్రాల్లోనే అటూ ఇటుగా ఉంటుందనే అంచనాతో మొత్తం ప్రచారం అంతా ఈ రాష్ట్రాల్లోనే జరుగుతుంది. ఇద్దరు అధ్యక్షులు కూడా ఈ రాష్ట్రాల్లోనే తిరుగుతుంటారు. అంటే ఈ పద్దతిలో అధ్యక్ష ఎన్నిక ఆ 7,8 రాష్ట్రాల ఫలితంపైనే ఆధారపడివుంది. ఇప్పటికే నిర్ణయాత్మకంగా ఒకవైపు వున్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయ్ లాంటి పెద్ద రాష్ట్రాలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి అయిన జో బైడెన్ వైపే వున్నాయి. పశ్చిమ తీరంలోని మూడు , తూర్పు కోస్తాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతం మొత్తం కూడా డెమోక్రాటిక్ పార్టీ వైపే వున్నాయి. మధ్య అమెరికాలోని అనేక రాష్ట్రాలు రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ వైపు వున్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలు, క్రైస్తవ ప్రాబల్యం అధికంగా వున్న రాష్ట్రాలు. ఇకపోతే పెద్ద రాష్ట్రాల్లో రెండోదయిన టెక్సాస్ కొద్ది మార్జిన్ తో ట్రంప్ వైపే వుంది. ఎన్నిక దగ్గర పడేటప్పటికి ఈ రాష్ట్రం ట్రంప్ వైపే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంటే పోటీ లోనుంచి అది కూడా లేదనుకుంటే మిగిలేది కొన్ని రాష్ట్రాలే. అవేమిటంటే ఫ్లోరిడా ( నాలుగో అతి పెద్ద రాష్ట్రం), పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, మిచిగాన్, నెవడా, ఆరిజోనా, ఒహాయో, జార్జియా. వీటిల్లో ఎవరికి ఆధిక్యత వస్తే వాళ్ళే అధ్యక్షులవుతారు. ఇందులోకూడా జో బైడెన్ కి కొన్ని వచ్చినా గెలిచే అవకాశం వుంది. కానీ ట్రంప్ కి ఇందులో దాదాపు అన్నీ గెలవాల్సి వుంది. అలాగయితేనే తనకి గెలుపు అవకాశాలు వుంటాయి. అందుకే ఇప్పటికి జో బైడెన్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ రాష్ట్రాల్లో ఎన్నిక అనేక అంశాలపై ఆధారపడి వుంది. ఉదాహరణకు పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలిన, ఒహాయో ల్లో తెల్ల జాతీయులు పూర్తి ఆధిపత్యం లో వున్నారు. శ్వేత జాతేతరుల సంఖ్య తక్కువ. నార్త్ కరోలినా తప్పించి మిగతా మూడు రాష్ట్రాల్లో పారిశ్రామిక కార్మికుల సంఖ్య అధికం. అదీ ఎక్కువమంది కాలేజీ చదువులేని తెల్ల జాతీయులే. వీళ్ళందరూ ట్రంప్ మద్దత్తు దారులే. ఒకనాడు పారిశ్రామిక కార్మికులందరూ డెమోక్రటిక్ పార్టీ వైపు వుండేవారు. 2016 లో ట్రంప్ కి మద్దత్తుదారులయ్యారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో తెల్ల వాళ్ళలో పురుషులలో ఎక్కువమంది ట్రంప్ అనుకూలురు. కానీ తెల్ల జాతి మహిళల్లో ఎక్కువమంది ట్రంప్ వ్యతిరేకులు. అందుకే వారు జో బైడెన్ కి మద్దత్తిస్తున్నారు. ఇక పెద్ద రాష్ట్రం ఫ్లోరిడా లో స్పానిష్ భాష మాట్లాడే లాటినోలు గణనీయంగా వున్నారు. దక్షిణాన క్యూబన్ లు, నికరాగువా, వెనిజులా దేశస్తులు అధికంగా వున్నారు. వీరు ఎక్కువభాగం ట్రంప్ కి మద్దత్తుదారులుగా వున్నారు. మధ్య ఫ్లోరిడా లో అమెరికా టెరిటరీ కి చెందిన పోర్టోరికా వాసులు గణనీయంగా వున్నారు. వీరు ఇద్దరి మధ్య చీలి వున్నా జో బైడెన్ వైపే ఎక్కువమంది వుండే అవకాశం వుంది. ఇకపోతే ఫ్లోరిడా మొత్తంలో రిటైరైన తెల్ల జాతీయులు నివాసం ఏర్పరుచుకున్నారు. ఇప్పటివరకు ఒపీనియన్ పోల్ ప్రకారం ఒక్క శాతం అటూ ఇటూ గానే ఇక్కడ ఓటింగ్ వుండే అవకాశం వుంది. ఫ్లోరిడా కనక ట్రంప్ ఓడిపోతే అధ్యక్షుడిగా గెలిచే అవకాశమే లేదు. అదే జో బైడెన్ ఫ్లోరిడా ఓడినా మిగతా రాష్ట్రాల్లో గెలిస్తే అధ్యక్షుడయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇక నెవడా, అరిజోనా ల్లో మెక్సికన్లు గణనీయంగా వున్నారు. ఇందులో ఆరిజోనా ఈసారి జో బైడెన్ వైపు మొగ్గు చూపే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. నెవాడా మాత్రం నువ్వా నేనా అన్నట్లు వుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ఇదీ ఇప్పటికి ఓటింగ్ సరళి. ఇంకా నెల రోజులు సమయముంది. ఏమైనా జరగొచ్చు. నిన్ననే న్యూ యార్క్ టైమ్స్ గత రెండు దశాబ్దాల ట్రంప్ కంపెనీ ఆర్ధిక ఫలితాలు బయటపెట్టింది. వీటిని ఇన్నాళ్ళు రహస్యంగా ట్రంప్ ఉంచాడు. దీని ప్రభావం ఏ మేరకు వుంటుందో చూడాలి. ఇప్పటికయితే పరిస్థితులు ట్రంప్ కి వ్యతిరేకంగా, జో బైడెన్ కి అనుకూలంగా వున్నాయనే చెప్పుకోవాలి.
ఇదీ ఈవారం అమెరికా ఎన్నికల విశేషాలు. ముందు ముందు మరిన్ని అమెరికా విశేషాలతో మీ ముందు కొస్తాం. సెలవు మరి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Trends in us presidential elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com