YS Sunitha Reddy: ఆమెది ఓ పేరుమోసిన రాజకీయ కుటుంబం. కానీ అప్పటివరకు ఆమెకు రాజకీయాలు తెలియవు. కేసులు, కోర్టులు అసలే తెలియవు. ఆమెకు తెలిసిందల్లా.. రోగికి వైద్యం చేయడం. ప్రాణం పోయడం. ప్రాణం పోసే స్థితిలో ఉండి కూడా కన్నతండ్రిని కాపాడుకోలేకపోయింది. తండ్రి ప్రాణాలు కాపాడలేకపోయినా సరే.. ప్రాణాలు తీసిన నేరస్థుల్ని కోర్టు బోనెక్కించేందుకు అహరహం పట్టుదల వీడక శ్రమిస్తోంది. ఎన్ని శక్తులు ఎదురైనా పోరాడుతోంది. కాంప్రమైజ్ కానంటోంది.

`వైఎస్ వివేకానందరెడ్డి ఆడపిల్లను కాదు.. ఆడపులిని కన్నాడు` ఇది వైఎస్ సునీతరెడ్డి గురించి జనంలో మాట. వైఎస్ వివేకా హత్యకేసులో ఆమె పట్టుదల చూసి జనం మాట్లాడిన మాట. వైఎస్ వివేకా హత్య కేసులో దోషుల్ని కోర్టు మెట్లు ఎక్కించేందుకు ఆమె పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తండ్రి హత్య కేసులో అనుమానితులందరూ బంధువులు, అనుచరులే. కుటుంబ సభ్యుల నుంచి కావాల్సిన సహకారం లేదు. కోర్టులు, కేసులు తెలియవు. కేవలం డాక్టర్ వృత్తికే అప్పటి వరకు ఆమె పరిమితమైంది. కానీ కాలం ఆమెను రాటుదేల్చింది. కష్టాలు ఆమెను కఠినంగా మార్చేశాయి.
పులివెందుల రాజకీయాలకు సునీతరెడ్డి మొదటి నుంచి దూరంగా ఉన్నారు. హైదరాబాద్ లో వైద్యవృత్తిలో కొనసాగుతున్నారు. తన తండ్రి వివేకానందరెడ్డి పెదనాన్న రాజశేఖరరెడ్డికి అండగా పులివెందుల్లో రాజకీయం నడిపాడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. కానీ సునీతను ఎప్పుడూ రాజకీయంగా ప్రోత్సహించలేదు. ఆమె కూడా ఆసక్తి చూపలేదు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆమెను రాజకీయ కుట్రలు చుట్టుముట్టాయి. తండ్రిని హత్య చేసిన హంతకులను తేల్చడానికి ఆమె కంకణం కట్టుకుంటే సొంతవారే ఆమెను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఆమె భర్తను కూడా కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారో సునీతకు తెలుసు. అందుకే ఆమె అనుమానితుల జాబితాలో వారి పేర్లు చేర్చింది. దీంతో హంతకులకు భయం మొదలైంది.

వైఎస్ సునీతరెడ్డిని నయానో, భయానో లొంగదీసుకునే ప్రయత్నం జరిగింది. కానీ ఆమె లొంగలేదు. డబ్బు, ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపినా ఎడమ కాలితో వాటిని తన్నింది. తనకు రాజకీయాలు అవసరం లేదని, తన తండ్రిని చంపిన వారు ఎవరో తేల్చడమే తన లక్ష్యమని ప్రకటించింది. అండగా ఉండాల్సిన అన్న ఆమెను ఆదరించలేదు. పైగా ఆమె పై బురదజల్లించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె సడలలేదు. గుండె ధైర్యంతో పోరాడుతోంది. ఏపీలో న్యాయం జరగదని సుప్రీం కోర్టుకు వెళ్లింది. మూడేళ్లయిన హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని కోర్టుకు విన్నవించింది. దీంతో సుప్రీంకోర్టు వైఎస్ వివేకా హత్యకేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చింది. సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సీబీఐ తీగ లాగితే డొంక మొత్తం కదులుతోంది. కలుగులోని ఎలుకలు ఒక్కొక్కటీ బయటికొస్తున్నాయి.
బలమైన శక్తులతో ఓ మహిళ పోరాడటం చాలా అరుదనే చెప్పాలి. వేరేవారు ఎవరైనా సరే డబ్బుకో, పదవులకో లొంగిపోయేవారేమో. కానీ వైఎస్ సునీతరెడ్డి వాటిని తృణప్రాయంగా తోసిపుచ్చింది. తండ్రి హత్యకు గురైతే .. ఎవరు చంపారో తేల్చాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఒక కూతురిగా తనదని నమ్మింది. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆమె ఆగలేదు. ముందుకు సాగుతూనే ఉంది. ఆమె పోరాటానికి ప్రకృతి కూడా సహకరిస్తోంది.