Nellore Politics: వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల ఆరోపణల పై దృష్టిసారించింది. ఉండేవారెవరో వెళ్లేవారెవరో లెక్కతేల్చేందుకు సిద్దమైంది. రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలికింది. నెల్లూరు జిల్లాలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు నష్టనివారణ చర్యలు చేపట్టింది. పార్టీని వదిలిన వారి స్థానంలో కొత్తవారిని నియమించింది.

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలతో వైసీపీ అధిష్ఠానం కంగు తింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పై కీలక వ్యాఖ్యలు చేసింది. అవన్నీ చిల్లర ఆరోపణలు అంటూ ప్రభుత్వ రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తేలిగ్గా కొట్టిపారేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పై స్పందించే అవకాశం లేదని చెప్పకనే చెప్పారు. కోటంరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఇంచార్జీగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా కొనసాగుతున్నారు.
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచారు. ఆదాల బలమైన నాయకుడు కావడంతో కోటంరెడ్డి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మరోవైపు టీడీపీ అవకాశం ఇస్తే రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జీగా నేదురమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. గత కొన్ని నెలలుగా ఆనం కూడా వైసీపీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో పార్టీ పై తరచూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. కొత్త ఇంచార్జీలను నియమించి కార్యకర్తల్లో మనోధైర్యం నింపింది.